రైతులపై కేంద్రం కపట ప్రేమ
ABN , Publish Date - May 15 , 2026 | 04:56 AM
స్వామినాథన్ కమిషన్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తోందని, పంటల ఉత్పత్తి వ్యయంపై 50 శాతం లాభం కలిగేలా కనీస మద్దతు ధర...
స్వామినాథన్ కమిషన్ సిఫారసులు బుట్టదాఖలు
నిరాశాజనకంగా మద్దతు ధరల పెంపు: తుమ్మల
హైదరాబాద్, మే 14(ఆంధ్రజ్యోతి): స్వామినాథన్ కమిషన్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తోందని, పంటల ఉత్పత్తి వ్యయంపై 50 శాతం లాభం కలిగేలా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) నిర్ణయించాలనే మూలసూత్రాన్ని తుంగలో తొక్కిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో విమర్శించారు. తాజాగా కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు నిరాశాజనకంగా ఉన్నాయన్నారు. వరి ఎమ్మెస్పీ క్వింటాలుకు కేవలం రూ.72 పెంచటం ఏమాత్రం సరిపోదని, పాత ధరతో పోలిస్తే ఈ పెరుగుదల మూడు శాతమేనని పేర్కొన్నారు. మొక్కజొన్న ఎమ్మెస్పీ రూ.2,410 ఉంటే ఇప్పుడు కేవలం రూ.10 పెంచి (0.4 శాతం) రైతులకు లాభం చేసినట్లు ప్రచారం చేసుకోవటం విడ్డూరంగా ఉందని, రైతులపై కపటప్రేమకు ఇది నిదర్శనమని విమర్శించారు. కూలీల కొరత, పెట్టుబడి ఖర్చులు, పురుగుమందుల వ్యయం, దిగుబడి అనిశ్చితి దృష్ట్యా కందిపప్పు, పత్తికి నిర్ణయించిన ఎమ్మెస్పీ కూడా సరిపోదన్నారు. వేరుశనగ, సోయాబీన్ ఎమ్మెస్పీలను 3.5, 7.1 శాతం మాత్రమే పెంచడం సరికాదని తెలిపారు. కేంద్రం ఎమ్మెస్పీ పెంపును ప్రతి ఏటా పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటున్నా... రైతుల ఆదాయంలో పెరుగుదల కనిపించటంలేదన్నారు. రైతుల ఆదాయ భద్రత కోసం 30-40 శాతం ఎమ్మెస్పీ పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. పంట ఉత్పత్తిలో 75 శాతం కేంద్రం కొనాలని, మొక్కజొన్న, జొన్న పంటలను ధరల మద్దతు పథకం పరిధిలోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు.