Share News

రామగుండం యూరియాను తెలంగాణకే ఇవ్వండి

ABN , Publish Date - Jun 23 , 2026 | 03:28 AM

రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047’ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కోరారు.

రామగుండం యూరియాను తెలంగాణకే ఇవ్వండి

  • భవ్య స్కీం ఫేజ్‌-1లో ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి..

  • ఏరోడిఫెన్స్‌ కారిడార్‌, రెండు మెగా లెదర్‌ పార్కులను మంజూరు చేయండి

  • కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047’ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కోరారు. రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్‌ఎ్‌ఫసీఎల్‌)పై ప్రత్యేక దృష్టి సారించాలని, అక్కడ ఉత్పత్తయ్యే మొత్తం యూరియాను తెలంగాణకే కేటాయించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతేడాది ఎరువుల సరఫరాలో ఎదురైన అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని శ్రీధర్‌బాబు కోరారు. వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేలా తెలంగాణ ఇండస్ట్రియల్‌ ‘ఎకో సిస్టం’ను అభివృద్థి చేస్తున్నామని, దీనికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సంబంధించిన పలు అంశాలపై పీయూష్‌ గోయల్‌కు వినతి పత్రం అందజేశారు. ‘‘జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలో రూ. 8,500 కోట్ల పెట్టుబడితో గ్లోబల్‌ ఇన్నోవేషన్‌, ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు హ్యుందాయ్‌ గ్రూప్‌ ముందుకొచ్చిందని కేంద్రమంత్రికి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ లాజిస్టిక్‌ హబ్‌ అభివృద్థికి కేంద్రం చొరవ చూపాలని కోరారు. భవ్య పథకం పేజ్‌ -1లో భాగంగా 15 నుంచి 20 ప్లగ్‌ అండ్‌ ప్లే ఇండస్ట్రియల్‌ పార్కుల అభివృద్థికి ఇప్పటికే డీపీఆర్‌లను సిద్థం చేస్తున్నామని... వీటికి జూన్‌-జూలై 2026 దరఖాస్తు విండోలోనే అనుమతి ఇస్తే రాష్ట్రంలో తయారీ రంగం మరింత బలోపేతం అవుతుందని వివరించారు. తెలంగాణకు ‘ఏరో-డిఫెన్స్‌ కారిడార్‌’ను మంజూరు చేయాల్సిన అవసరాన్ని మంత్రి శ్రీధర్‌ బాబు పీయూ్‌షకు ప్రత్యేకంగా వివరించారు. హైదరాబాద్‌లో ‘నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేేసందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్థంగా ఉందని, ఇందుకు కేంద్రం చొరవ చూపాలని కోరారు. మెగా లెదర్‌, ఫుట్‌వేర్‌ అండ్‌ యాక్సెసరీస్‌ క్లస్టర్‌ డెవల్‌పమెంట్‌ (ఎంఎల్‌ఎ్‌ఫఏసీడీ) పథకం కింద రెండు మెగా లెదర్‌ పార్కులను కేటాయించాలని కోరారు. పామ్‌ ఆయిల్‌ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్థరించేందుకు చర్యలు తీసుకోవాలని శీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jun 23 , 2026 | 03:28 AM