మహిళల భద్రతకు ‘షీ సైబర్ ల్యాబ్’
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:11 AM
రాష్ట్రంలో మహిళల రక్షణ, సాధికారత, ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు సోమవారం సచివాలయంలో పలు కీలక శాఖల...
ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళల రక్షణ, సాధికారత, ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు సోమవారం సచివాలయంలో పలు కీలక శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల సంక్షేమం కోసం కేవలం ఒక శాఖపైనే కాకుండా విద్య, వైద్యం, పోలీస్, మునిసిపల్ వంటి అన్ని శాఖల మధ్య సమన్వయం పెరగాలన్నారు. సైబర్ నేరాలు, డేటింగ్‌యాప్ మోసాల నుంచి మహిళలను రక్షించేందుకు ప్రత్యేకంగా ‘షీ సైబర్ ల్యాబ్’ ఏర్పాటును పరిశీలించనున్నారు. స్కూల్ స్థాయి నుంచే బాలికలకు స్వీయరక్షణ శిక్షణ తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. మానవ అక్రమరవాణా, పోక్సో కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై చర్చించారు. స్కూళ్లలో విద్యార్థినులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అదనపు పోషకాహారం అందించాలని మంత్రి సూచించారు. గ్రామ స్థాయిలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షల శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రైవేట్‌రంగంలోనూ మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అమల వ్వాలని, పాఠ్యాంశాల్లో లింగ సమానత్వ భావనను చేర్చాలన్నారు. వీటి అ మలుకు అంశాలవారీగా సబ్‌కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.