క్రెచ్ వర్కర్ల వేతనాలను పెంచండి
ABN , Publish Date - Mar 15 , 2026 | 07:04 AM
శిశు సంరక్షణ కేంద్రాలలో పనిచేస్తున్న వర్కర్లు, హెల్పర్ల వేతనాలను పెంచాలని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రి అన్నపూర్ణదేవికి రాష్ట్ర మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి అన్నపూర్ణదేవికి మంత్రి సీతక్క వినతి
న్యూఢిల్లీ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): శిశు సంరక్షణ కేంద్రాలలో పనిచేస్తున్న వర్కర్లు, హెల్పర్ల వేతనాలను పెంచాలని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రి అన్నపూర్ణదేవికి రాష్ట్ర మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. శనివారం, కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవితో ఆమె నివాసంలో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ప్రస్తుతం క్రెచ్‌వర్కర్లకు ఒక్కొకరికి నెలకు రూ.5,500, హెల్పర్లకు రూ.3 వేలుగౌరవ వేతనంగా ఇస్తున్నారని.. ఇది వారు చేసే పనికి, బాధ్యతలకు ఏమాత్రం సరిపోదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఇన్‌క్లూజివ్ సిటీస్ ఫర్ విమెన్ అండ్ గర్ల్స్’ కార్యక్రమం కింద తెలంగాణ నుంచి ములుగు జిల్లాను ఎంపిక చేయడం పట్ల కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ములుగులో ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన డీపీఆర్ రూపకల్పనలో.. జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని తెలిపారు.