ప్రజలకు అప్పులు.. కేసీఆర్ కుటుంబానికి ఆస్తులా?
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:15 AM
బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.8లక్షల కోట్ల మేర అప్పుల భారం మోపారని, కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులను వెనకేసుకుందని...
బీఆర్‌ఎస్‌ను ‘ఫాంహౌస్ రాష్ట్ర సమితి’గా మార్చుకోండి
వచ్చే ఎన్నికల్లో ‘కారు’ తుక్కు తుక్కే: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, జూలై 1(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.8లక్షల కోట్ల మేర అప్పుల భారం మోపారని, కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులను వెనకేసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి డబ్బుతో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చినందుకే గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని రాజకీయంగా బొంద పెట్టారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి.. నిరంతరం ఫాంహౌ్‌సకే పరిమితమైన కేసీఆర్ తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎ్‌సను ఇకపై ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫాంహౌస్ రాష్ట్ర సమితి)గా మార్చుకునే సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. సొంత చెల్లి, బావ ఫోన్లను సైతం ట్యాప్ చేయించిన బీఆర్‌ఎస్ నాయకులు.. ఈ రోజు సభ్యత, సంస్కృతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల నిర్ణయం ప్రకారం ‘కారు’ తుక్కు తుక్కు కావడం ఖాయమని జోస్యం చెప్పారు.