కాళేశ్వరం అవినీతిపై సీబీఐ మౌనం బీజేపీ, బీఆర్‌ఎస్ లాలూచీకి నిదర్శనం
ABN , Publish Date - May 06 , 2026 | 07:19 AM
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మౌనం వహించడం.. బీజేపీ, బీఆర్‌ఎస్ లాలూచీకి నిదర్శమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హనుమకొండ, మే 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మౌనం వహించడం.. బీజేపీ, బీఆర్‌ఎస్ లాలూచీకి నిదర్శమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కమిషన్ విచారణ జరిపి.. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని నివేదికను సీబీఐకి అప్పగించి తొమ్మిది నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. మంగళవారం హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాష్ట్రస్థాయి రైతు మేళాను పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాళేశ్వరం, యాదాద్రి పవర్ ప్లాంట్ విద్యుత్ కొనుగోళ్లలో అవినీతిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చూడాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్రం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చి మూడు నల్లచట్టాలకు వంతపాడిన బీఆర్‌ఎస్ నేతలను గ్రామాల నుంచి తరమికొట్టాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు జరిగే రైతు మేళాలో 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు.
ప్రతి దరఖాస్తుకు 3 నెలల్లో పరిష్కారం
ఖమ్మం రూరల్: ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సమస్య అర్హత మేరకు ప్రతీ దరఖాస్తుకు మూడు నెలల్లోపు పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. సాదాబైనామా దరఖాస్తులను రాబోయే 35 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు.