Share News

పేదల ఇళ్లకన్నా కాళేశ్వరం కమీషన్లే ముఖ్యమయ్యాయి

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:03 AM

గత బీఆర్‌ఎస్‌ పాలకులకు పేదల ఇళ్లకంటే కాళేశ్వరం కమీషన్లే ఎక్కువయ్యాయని, కాళేశ్వరం ప్రాజెక్టుకోసం లక్షల కోట్లు వెచ్చించడం ద్వారా ఆ పార్టీ నాయకులు దోపిడీకి పాల్పడ్డారని .....

పేదల ఇళ్లకన్నా కాళేశ్వరం కమీషన్లే ముఖ్యమయ్యాయి

  • గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదు

  • మార్చిలో రెండో దఫా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

  • మునిసిపల్‌ ఎన్నికల ప్రచారాల్లో మంత్రి పొంగులేటి

అశ్వారావుపేట / కొత్తగూడెం పోస్టాఫీ్‌ససెంటర్‌ / సత్తుపల్లి, పిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ పాలకులకు పేదల ఇళ్లకంటే కాళేశ్వరం కమీషన్లే ఎక్కువయ్యాయని, కాళేశ్వరం ప్రాజెక్టుకోసం లక్షల కోట్లు వెచ్చించడం ద్వారా ఆ పార్టీ నాయకులు దోపిడీకి పాల్పడ్డారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు ఖమ్మం జిల్లా సత్తుపలిలో రోడ్‌షోలు నిర్వహించారు. ఇందిరమ్మ ప్రభుత్వం మొదటిదఫాలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేసిందని, మార్చి, ఏప్రిల్‌లో మరోసారి ఇళ్లు ఇస్తామన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 4,500 ఇళ్లు ఇచ్చామని, స్థలాలు లేని పేదలందరికీ న్యాయం చేసేందుకు జీ ప్లస్‌ విధానంలో భవనం నిర్మించి ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇల్లు ఇస్తామన్నారు. రైతును రాజు చేసేందుకు ప్రభుత్వం రూ.21వేల కోట్ల రుణమాఫీ చేసిందని, ఎకరానికి రూ.12వేల చొప్పున రైతు భరోసా, సన్న ధాన్యంపై క్వింటాకు రూ.500 బోనస్‌, పేదలకు రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం, కొత్త రేషన్‌ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తోందన్నారు. అశ్వారావుపేటలో దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యలపై సర్వే చేసి పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ప్రకటించారు. ‘ఎన్నికల వేళ స్వతంత్రుల ముసుగులో వచ్చే అవతారులను నమ్మొద్దు. నాకు శీనన్న తెలుసు... ఆయనకు నేను సన్నిహితుడిని అంటూ... మీ ముందుకు వచ్చే వారు ఎవరూ నాకు దగ్గరవారు కాదు’ అని పొంగులేటి స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధికోసం సొంతమనుషులమని చెప్పుకునే వారి పట్ల ఓటర్లు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Updated Date - Feb 06 , 2026 | 04:07 AM