జర్నలిస్టుల ఇళ్లస్థలాలపై జూన్ 2న శుభవార్త
ABN , Publish Date - May 02 , 2026 | 05:22 AM
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై రాష్ట్ర సమాచార శాఖ మంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రక్రియను వేగవంతం చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న శుభవార్త చెబుతామని పేర్కొన్నారు.
మంత్రి పొంగులేటి ప్రకటన
నాలుగు ప్రధాన సొసైటీల సభ్యులతో భేటీ
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి) : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై రాష్ట్ర సమాచార శాఖ మంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రక్రియను వేగవంతం చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న శుభవార్త చెబుతామని పేర్కొన్నారు. సచివాలయంలో నాలుగు సొసైటీల ప్రతినిధులతో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ముకుందరెడ్డి పాల్గొన్నారు. దీనికి ముందు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో జర్నలి్‌స్టల ఇళ్లస్థలాలపై చర్చించిన మంత్రి నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. కాగా, మంత్రి పొంగులేటి కంటే ముందు 4 సొసైటీల ప్రతినిధులతో మీడియా అకాడమీ చైర్మన్, సమాచార శాఖ కమిషనర్ సమాలోచనలు జరిపారు. ఇళ్ల స్థలాలపై వివిధ సొసైటీల ప్రతినిధుల అభిప్రాయం తీసుకున్నారు. ఈ వివరాలను సమాచార కమిషనర్ ముకుందరెడ్డి మంత్రి పొంగులేటికిఅందించారు. అనంతరం ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న మంత్రి.. జూన్ 2నాటికి సమస్యను కొలిక్కి తెస్తామని ప్రకటించారు. 9 మందికి మించకుండా సొసైటీల నిర్వాహకులతో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలతో విజ్ఞాపన పత్రాన్ని రూపొందించాలని సూచించారు. ఆ ప్రతిని తాను డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని వనరుల సమీకరణ ఉపసంఘానికి అందజేస్తానని చెప్పారు. సబ్ కమిటీ ఆమోదముద్ర వేశాక అందరం కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి స్థలాల కేటాయింపు ఫైల్‌పై ఆయనతో సంతకం చేయిద్దామని తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (జేఎన్జే) ప్రతినిధులతోనూ మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జేఎన్జే సభ్యులకు న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు.