సనత్‌నగర్ టిమ్స్ పనుల పూర్తికి అంచనాలు రూపొందించండి
ABN , Publish Date - May 29 , 2026 | 03:38 AM
సనత్‌నగర్ టిమ్స్‌ను పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి అవసరమైన కొనసాగింపు పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించాలని....
అంతర్జాతీయ స్థాయి లేబరేటరీ ఏర్పాటుపై కమిటీ
అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): సనత్‌నగర్ టిమ్స్‌ను పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి అవసరమైన కొనసాగింపు పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం టిమ్స్ ప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లను, ఆస్పత్రిలోని అన్ని విభాగాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ప్రతిపాదిత పరిపాలనా భవనంలో ఆస్పత్రి నిర్వహణ, మెరుగైన వైద్య సేవల కల్పన, సివిల్ పనులను శరవేగంగా పూర్తి చేయడం వంటి అంశాలను సమీక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఆస్పత్రి నిర్వహణ, మెరుగైన వైద్య సేవల కల్పనపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఇక్కడ నెలకొల్పనున్న అంతర్జాతీయ స్థాయి లేబొరేటరీపై డీఎంఈ, హెచ్‌ఓడీ, తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి కమిటీని ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో పురుష, మహిళా వైద్యులకు విడివిడిగా హాస్టల్ బ్లాక్‌లను ఏర్పాటు చేయాలన్నారు. మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని, రోగుల సహాయకుల కోసం ధర్మశాల, రెండు క్యాంటీన్‌లను ఏర్పాటు చేయాలని, టీబీ హాస్పిటల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. విదేశీ రోగుల విభాగంలో ఆధునిక సౌకర్యాలకు పెద్దపీట వేయాలని సూచించారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద పోలీస్ అవుట్ పోస్టును, అధునాతన ఇంటీరియర్, లాంజ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు అంతర్జాతీయ స్థాయి ఆధునిక పరికరాలు, వైద్య సదుపాయాలు, లేబొరేటరీ, బ్లడ్ బ్యాంకులను మంత్రి పరిశీలించారు.