భావి ఆర్థిక వ్యవస్థను శాసించేది నైపుణ్యమే
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:28 AM
భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థను నైపుణ్యం మాత్రమే శాసిస్తుందని, పెట్టుబడి కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఫిస్టా సదస్సులో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, జనవరి 30 (ఆంధ్ర జ్యోతి): భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థను నైపుణ్యం మాత్రమే శాసిస్తుందని, పెట్టుబడి కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్‌లో శుక్రవారం జరిగిన ఫ్యూచర్ ఆఫ్ ఇంటెలిజెంట్ అండ్ ఎవాల్వ్ స్ట్రాటర్జీస్ ఇన్ టాలెంట్ అక్విజేషన్ (ఫిస్టా)-2026 సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో నైపుణ్యం లేని యువతకు నైపుణ్య శిక్షణ, నిపుణులకు కాలానుగుణంగా పునఃనైపుణ్య శిక్షణ, ఈ రెండు దశలు దాటిన వారికి ఉన్నత స్థాయి నైపుణ్యాభివృద్ధి (స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, ఆప్-స్కిల్లింగ్)కి అవసరమైన శిక్షణనివ్వడంపై తమ సర్కారు దృష్టి సారించిందన్నారు. నిత్యం నేర్చుకునే తత్వం గల చోటే ప్రతిభ నిలుస్తుందన్న శ్రీధర్‌బాబు.. వృద్ధికి అదే అసలైన ప్రాతిపదిక అని చెప్పారు. భారత వృద్ధిరేటు 7ు ఉండొచ్చని కేంద్ర ఆర్థిక సర్వే అంచనా వేయడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ స్థాయిలో వృద్ధిని నిలబెట్టుకోవడానికి సంస్థాగత సామర్థ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. కృత్రిమ మేధ(ఏఐ)పై ఆధారపడటం కన్నా దాన్ని సమర్ధవంతంగా వాడుకోవాలన్నారు. కేవలం ఉద్యోగాల సృష్టికి పరిమితం కాకుండా రాష్ట్రాన్ని పరిశ్రమలకు భాగస్వామిగా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణను అత్యుత్తమ మానవ వనరులకు చిరునామాగా నిలపడంలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్ వర్సిటీ, ఐకాం, లైఫ్‌సైన్సెస్ స్కూల్, యంగ్ ఇండియా స్కూల్ కీలక ప్రాత పోషిస్తాయని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
ఎడ్‌సెట్ పోస్టర్ ఆవిష్కరణ
టీ-సాట్ నెట్‌వర్క్ చానళ్లు ప్రసారం చేసే ఎడ్‌సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. టీ-సాట్ సీఈఓ వేణుగోపాలరావుతో కలిసి సచివాలయంలోని తన చాంబర్‌లో ఆవిష్కరించిన శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఎడ్‌సెట్‌లో ఉన్నతమైన ర్యాంకులను సాధించడానికి టీ-సాట్ అందించే డిజిటల్ కంటెంట్‌ను ఉపయోగించుకోవాలని యువతకు సూచించారు. సోషల్ మీడియా వేదికలపై టీ-సాట్ కంటెంట్ అందుబాటులో ఉంటుందని, ఫలితంగా గ్రామీణ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. మేలో జరిగే ఎడ్‌సెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఫిబ్రవరి 2 నుంచి మే 11 వరకూ రోజుకు 4 గంటల చొప్పున 392 ఎపిసోడ్లు ప్రసారం చేస్తున్నామని మంత్రి తెలిపారు.