Share News

అర్ధరాత్రి గాలివాన బీభత్సం

ABN , Publish Date - May 28 , 2026 | 03:21 AM

రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. పొలాలు, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం, మొక్కజొన్న తడిసిముద్దయ్యాయి. మామిడి పంటకూ నష్టం వాటిల్లింది.

అర్ధరాత్రి గాలివాన బీభత్సం

  • తడిసిముద్దయిన ధాన్యం, మొక్కజొన్న

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. పొలాలు, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం, మొక్కజొన్న తడిసిముద్దయ్యాయి. మామిడి పంటకూ నష్టం వాటిల్లింది. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో అత్యధికంగా 13.9సెం.మీ, భూత్పూర్‌ మండలంలో 11.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, గద్వాల్‌, నారాయణపేట, నిజామాబాద్‌, వికారాబాద్‌, నల్లగొండ జిల్లాల్లోనూ వర్షం దంచికొట్టింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతా ల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. బేగంపేట చీకోటి గార్డెన్‌ వద్ద చెట్టు పడి కారు ధ్వంసమైంది. వెంగళరావునగర్‌లో విద్యుత్‌ స్తంభం పార్కింగ్‌లో ఉన్న కారుపై పడింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో గాలి ఉధృతికి భారతమ్మ కాటన్‌ మిల్లు పైరేకులు ఎగిరిపడి.. ఓ మహిళకు గాయాలయ్యాయి. కోదాడ దుర్గాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఓ హోటల్‌ పైకప్పు రేకులు ఊడిపడ్డాయి. మేళ్లచెర్వు మండలం రేవూరులో 30ఇళ్లు దెబ్బతిన్నాయి. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో ఓ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఇంట్లో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని ఐకేపీ కేంద్రాల్లోని 9 వేల క్వింటా ళ్ల ధాన్యం తడిసిపోయింది. పిడుగుపాట్లకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో పది, నల్లగొండ జిల్లాలో ఐదు పశువులు మృత్యువాతపడ్డాయి. కరీంనగర్‌లో పలుచోట్ల భారీ చెట్లు కూలిపోయాయి. కామారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో ధాన్యం, మొక్కజొన్న కొనాలని రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వ అసమర్థత, ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం వల్లే రైతుల కష్టం నీళ్లపాలవుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు: సీఎం రేవంత్‌:

వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. కల్లాల్లో ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

నేటి నుంచి మళ్లీ ఎండల తీవ్రత!

భానుడి భగభగలతో నిప్పులకుంపటిలా మారిన రాష్ట్రంలో వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ప్రజలకు బుధవారం ఉపశమనం లభించింది. కొన్ని జిల్లాల్లో 10 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గురువారం నుంచి భానుడి భగభగ మళ్లీ మొదలవుతుందని, ఈ నెల 31 వరకు వడగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - May 28 , 2026 | 03:21 AM