కల్తీ కేటుగాళ్ల ఆటకట్టు
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:33 AM
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే కల్తీ రాయుళ్లు, నాసిరకం మందుల తయారీదారుల ఆట కట్టించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
టీజీ సేఫ్ పేరిట ఏకీకృత అథారిటీ
ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాల విలీనం
కమిషనర్‌గా అవినాశ్ మహంతి నియామకం
ఆగస్టు 15 నుంచే అమల్లోకి తెస్తూ జీవో జారీ
తొలుత ‘క్యూర్’లో ప్రయోగాత్మకంగా అమలు
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే కల్తీ రాయుళ్లు, నాసిరకం మందుల తయారీదారుల ఆట కట్టించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇప్పటివరకు వేర్వేరుగా పని చేస్తున్న ఫుడ్ సేఫ్టీ, ఔషధ నియంత్రణ మండలిని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు శాఖలను కలిపి టీజీ సేఫ్(తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్) పేరుతో ఏకీకృత అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15 నుంచే ఈ వ్యవస్థ అమలులోకి వచ్చింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ విభాగం, ఫుడ్ సేఫ్టీ విభాగాల మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు. దీంతో కల్తీ కేటుగాళ్లు చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని తప్పించుకుంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా, రెండింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చారు. దేశంలోని పలు అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఇప్పటికే విజయవంతమైన ఈ విధానం ద్వారా ప్రజారోగ్యానికి పూర్తి రక్షణ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రెండు శాఖలను విలీనం చేసినప్పటికీ, ఫుడ్ ేసఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్-1940 కింద ఆయా అధికారు లకు ఉన్న చట్టబద్ధ అధికారాలకు ఎలాంటి భంగం వాటిల్లదని తాజా జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లు స్వతంత్రంగా తమ చట్టపరమైన బాధ్యతలను నెరవేరుస్తారు. టీజీ సేఫ్ కమిషనర్ ఈ మొత్తం వ్యవస్థకు అధిపతిగా ఉంటారు. ప్రస్తుతం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్న అవినాశ్ మహంతికి టీజీసేఫ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
టీజీసేఫ్ కింద ఆరు విభాగాలు
డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం: డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం-1940 ప్రకారం లైసెన్సింగ్, తనిఖీలు, శాంపిలింగ్, టెస్టింగ్, విచారణలను చేపడుతుంది.
ఫుడ్‌సేఫ్టీ విభాగం: ఫుడ్‌సేఫ్టీ యాక్ట్-2006 ప్రకారం లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్, తనిఖీలు, చట్టం అమలును పర్యవేక్షిస్తుంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం: ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించడం, ప్రమాదకరమైన ప్రదేశాల్లో తనిఖీలు చేయడం, కేసులు నమోదు చేయడంలో ఆహార, ఔషధ విభాగాలకు సహకరిస్తుంది. ప్రారంభంలో దీని కోసం పోలీసు శాఖ నుంచి సిబ్బందిని డిప్యుటేషన్‌పై కేటాయిస్తారు.
లీగల్-ప్రాసిక్యూషన్ విభాగం: రెండు విభాగాలకు అవసరమైన చట్టపరమైన సలహాలు, కోర్టు కేసుల విచారణలో ప్రాసిక్యూషన్ మద్దతు అందిస్తుంది.
లేబొరేటరీ విభాగం: ఫుడ్ టెస్టింగ్, డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఈ విభాగం కిందకు వస్తాయి. దీని కింద రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పని చేస్తారు.
పరిపాలనా విభాగం: మానవ వనరులు, బడ్జెట్, ఖాతాలు, అడ్మినిస్ట్రేటివ్ అంశాలను చూసుకుంటుంది.
ఆధునికీకరణకు రాష్ట్ర స్థాయి కమిటీ
హోటళ్లు, ఆహార తయారీ కేంద్రాలు, ఫార్మా పరిశ్రమలు అత్యధికంగా ఉన్న క్యూర్ రీజియన్ పరిధిలో టీజీసే్‌ఫను తొలుత ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఇక్కడ వచ్చే ఫలితాలు, లోటుపాట్లను సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరిస్తారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సమర్థవంతంగా సాగేందుకు తగినంత మంది పోలీసు సిబ్బందిని టీజీ సేఫ్‌కు కేటాయించాలని డీజీపీని సర్కారు ఆదేశించింది. దీని అమలుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేయడంతోపాటు ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యుటేషన్, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ పద్ధతుల్లో భర్తీ చేసేందుకు అనుమతినిచ్చింది. కాగా, మారుతున్న ఆహార, ఔషధ వ్యాపార సరళికి అనుగుణంగా చట్టాల అమలులో ఎలాంటి లోపాలు లేకుండా వ్యవస్థను ఆధునికీకరించడానికి రాష్ట్ర స్థాయి కమిటీని నియమించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వ్యవస్థీకృత ఆధునికీకరణ, సర్వీస్ రూల్స్ ఏకీకరణ, సిబ్బంది సంఖ్యను నిర్ణయించడం, సాంకేతికత వినియోగంపై ఈ కమిటీ సమగ్ర పరిశీలన చేసి సిఫారసులు చేస్తుందని వెల్లడించింది. క్యూర్ రీజియన్ పరిధిలో టీజీ సేఫ్ పని తీరు, సాధించిన ఫలితాలను పరిశీలించి, రాష్ట్రమంతటా విస్తరించే అంశంపై రాష్ట్ర స్థాయి కమిటీ తన నివేదికను సమర్పించనుంది.