మీ సేవా చార్జీల భారీ పెంపు
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:18 AM
రాష్ట్రంలో మీ సేవ కేంద్రాల్లో అన్ని సేవల ధరలను ప్రభుత్వం భారీగా పెంచింది. ఆయా సేవలపై 18 శాతం జీఎస్టీని ఇకపై వినియెూగదారులే చెల్లించాల్సి ఉంటుంది.
సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి..
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మీ సేవ కేంద్రాల్లో అన్ని సేవల ధరలను ప్రభుత్వం భారీగా పెంచింది. ఆయా సేవలపై 18 శాతం జీఎస్టీని ఇకపై వినియెూగదారులే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఐటీ, ఎలకా్ట్రనిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ జీవో నంబర్ 1ని విడుదల చేసింది. ఈ సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాటగిరీ-ఏ కింద సేవలకు వసూలు చేసే రుసుం గతంలో రూ.35గా ఉండగా.. ప్రస్తు తం రూ.62కు పెంచారు. ఈ క్యాటగిరీలో అడంగల్, పహాణీ, జనన ధ్రువీకరణ పత్రం ప్రింట్ వంటి తక్షణ సేవలున్నాయి. ఇక క్యాటగిరీ-బీ సేవల చార్జీలు గతంలో రూ.45 ఉండగా.. రూ.80కి పెరిగాయి. ఇందులో కుల, ఆదాయ, నివాస, జనన, మరణ ధ్రువీకరణ, భూభారతి ఈ-కేవైసీ, కొత్త విద్యుత్తు కనెక్షన్ దరఖాస్తు వంటి సేవలున్నాయి. అలాగే ప్రింట్ల విషయానికొస్తే.. మొదటి నాలుగు పేజీల తర్వాత ఇచ్చే ప్రతి పేజీకి వసూలు చేసే స్కానింగ్, ప్రింటింగ్ చార్జీలు కూడా పెంచారు. ఇప్పటివరకు రూ.2 ఉండగా.. దాన్ని 2.50కి పెంచారు. విద్యుత్తు బిల్లుల చెల్లింపుల విషయంలో కూడా పెంపు అమలులోకి వచ్చింది. కరెంటు బిల్లు రూ.200 వరకు ఉంటే రూ.4కి పెంచగా.. అంతకంటే ఎక్కువ మొత్తాలపై రూ.9 నుంచి 44 వరకు చెల్లించే బిల్లును బట్టి వసూలు చేయనున్నారు. ఇక చివరిసారిగా మీసేవ సేవల చార్జీలను 15 ఏళ్ల క్రితం సవరించారు. ఇప్పటివరకు అన్ని సేవలకు 18 శాతం జీఎస్టీని మీసేవ నిర్వాహకులే చెల్లిస్తున్నారు. ఈ అంశంపై వారు అనేక సార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే నిర్వహణ ఖర్చు పెరిగిందని, కమీషన్‌ను పెంచాలని ప్రభుత్వాన్ని ఎప్పట్నుంచో కోరుతూ వస్తున్నారు. దీంతో ధరలు సవరించిన సర్కారు.. జీఎస్టీతో కలిపి మొత్తం చార్జీలను వినియోగదారులే చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే ఈ సేవలకువసూలు చేసిన ఫీజులో 70 శాతం వరకు నిర్వాహకుల (వీఎల్‌ఈ) వాటాగా కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. చార్జీల పెంపుపై తెలంగాణ మీసేవ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బైర శంకర్, అబ్దుల్ మోయిద్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, మీసేవ చార్జీల పెంపు కారణంగా పేద, మధ్య తరగతి విద్యార్థులు, నిరుద్యోగులపై ఆర్థిక భారం పడనుంది.