Share News

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ రద్దు

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:51 AM

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) రద్దు-2026 బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బుధవారం ఈ బిల్లును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ప్రవేశపెట్టగా అన్ని.....

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ రద్దు

  • దాని స్థానంలో సెకండరీ హెల్త్‌కేర్‌ డైరెక్టరేట్‌

  • బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. విపక్షాల మద్దతు

  • ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికే ఈ నిర్ణయం

  • ఆ సంస్థ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు

  • నగదురహిత వైద్యం, 1.2 కోట్ల ప్రమాద బీమా

హైదరాబాద్‌, మార్చి 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) రద్దు-2026 బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బుధవారం ఈ బిల్లును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ప్రవేశపెట్టగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. టీవీపీసీ స్థానంలో ‘తెలంగాణ సెకండరీ హెల్త్‌కేర్‌ డైరెక్టరేట్‌’ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇది ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తూ ఉద్యోగుల దశాబ్దాల నాటి సమస్యలను పరిష్కరించే చరిత్రాత్మక నిర్ణయమన్నారు. టీవీవీపీ గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ సంస్థగా ఉండటంతో అనేక పరిపాలనా పరిమితులు ఎదుర్కొంటోందని చెప్పారు. టీవీవీపీని ప్రభుత్వ విభాగంగా మార్చడంతో దాని పరిధిలోని వేలాది మంది ఉద్యోగులకు 010 పద్దు కింద ట్రెజరీ ద్వారా సకాలంలో వేతనాలు అందుతాయని, వారికి పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల హోదా లభిస్తుందన్నారు. ఎంప్లాయీ హెల్త్‌ స్కీమ్‌ కింద నగదురహిత వైద్యంతో పాటు రూ.1.2 కోట్ల ప్రమాద బీమా వర్తింపచేస్తామన్నారు. ఆసుపత్రుల్లో గైనకాలజీ, జనరల్‌ మెడిసిన్‌, సర్జరీ, పీడియాట్రిక్స్‌ వంటి 8 కీలక విభాగాలను బలోపేతం చేస్తామని చెప్పారు. జిల్లా స్థాయిలోనే 80శాతం వైద్య సేవలందేలా చూస్తామన్నారు. గ్రామీణుల కోసం 11 ప్రధాన ఆసుపత్రుల్లో కొత్తగా సీటీ స్కాన్‌ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఐదు జిల్లా ఆస్పత్రుల్లో పీజీ మెడికల్‌ కాలేజీలు నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో డయాలసిస్‌ కేంద్రాలను పెంచి ప్రతి రోగికి 20-25 నిమిషాల్లో సేవలందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర, జాతీయ రహదారుల వెంట ప్రతి 35 కి.మీ.కు ఒక ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని, మొత్తం 109లో 74 కేంద్రాలతో పాటు టీవీవీపీ ఆస్తులన్నీ కూడా కొత్త డైరెక్టరేట్‌ పరిధిలోనే ఉంటాయని చెప్పారు.

Updated Date - Mar 26 , 2026 | 04:51 AM