Share News

స్పెషలిస్టు వైద్యుల విలీనమెప్పుడు?

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:21 AM

వైద్య విద్య కాలేజీల్లో అధ్యాపకుల కొరతను కొంతలో కొంతైనా అధిగమించే అవకాశం ఉన్నా.. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక్క అడుగూ ముందుకు పడడం లేదు.

స్పెషలిస్టు వైద్యుల విలీనమెప్పుడు?

  • వైద్య కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీరేదెప్పుడు?

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య కాలేజీల్లో అధ్యాపకుల కొరతను కొంతలో కొంతైనా అధిగమించే అవకాశం ఉన్నా.. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక్క అడుగూ ముందుకు పడడం లేదు. రాష్ట్రంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తీవ్రమైన అధ్యాపకుల కొరత నెలకొంది. ఒక్క అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఖాళీలే 2 వేల వరకు ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయాలంటే.. నేరుగా నియామకాలు చేపట్టాలి. లేదంటే ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌), తెలంగాణ వైద్య విధాన పరిషత్‌(టీవీవీపీ) కమిషనర్‌ పరిధిలోని ఆస్పత్రుల్లో పని చేసే స్పెషలిస్టు వైద్యులను విలీనం (డీఎంఈ పరిఽధిలోకి తీసుకోవాలి) చేసుకోవాలి. వాస్తవానికి ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లలో కేవలం ఎంబీబీఎస్‌ వైద్యులుంటే సరిపోతుంది. అక్కడ స్పెషలిస్టు వైద్యుల సేవలు అవసరం లేదు. అలాగే, టీవీవీపీ పరిధిలోని సూపర్‌ స్పెషాలిటీ వైద్యులను కూడా డీఎంఈలోకి విలీనం చేసే వెసులుబాటు ఉంది. గతంలో డీహెచ్‌, టీవీవీపీ పరిధిలోని స్పెషాలిటీ వైద్యులను డీఎంఈలోకి మార్చేవారు. కానీ, ఇప్పుడు ఆ దిశగా ఎలాంటి కసరత్తు జరగడం లేదు. అలాగే, బోధనాస్పత్రుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ క్యాడర్‌ పోస్టులను రెండు పద్ధతుల్లో తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 60శాతం మందిని, ఇన్‌ సర్వీస్‌ పీజీలను 40 శాతం మందిని తీసుకోవాలి. ప్రస్తుతం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్పెషాలిటీ అర్హతలు కలిగిన 240మంది ఇన్‌ సర్వీస్‌ వైద్యులు ఏడాదిపైగా వివిధ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరు బోధనా బాధ్యతలు నిర్వర్తించడానికి అర్హులైనప్పటికీ, ఒక చిన్న నిబంధన కారణంగా వారికి పోస్టింగ్‌ ఇవ్వడం లేదు. పీజీ పూర్తి చేసిన తర్వాత ఏడాది పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీనియర్‌ రెసిడెన్సీ(ఎ్‌సఆర్‌)గా పని జేయాలి. ఈ 240 మందిలో సుమారు 200 మందికి పీజీ చేసి ఏడాది పూర్తి కాలేదు. వీరి విషయంలో ఏడాది నిబంధనను ఎత్తి వేస్తే.. వారంతా డీఎంఈకు సరెండర్‌ అవుతారు. అయితే ఈ నిబంధనను ఎత్తి వేయాలని డీఎంఈ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి వెళ్లాలి. కానీ ఇంతవరకూ అలాంటి విజ్ఞప్తి సర్కారుకు వెళ్లకపోవడంతో ఆ 200 మంది డీఎంఈకు సరెండర్‌ కాలేదు. డీఎంఈ కార్యాలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అందుబాటులో ఉన్న మానవ వనరులను పూర్తిగా ఉపయోగించుకోలేని దుస్థితి ఏర్పడింది. మరోవైపు.. గతంలో డీహెచ్‌ నుంచి విలీనమైన ఇన్‌ సర్వీస్‌ పీజీలకు కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌ ఇచ్చారు. అయితే వారిలో కొంతమంది తమకు నచ్చిన చోట పోస్టింగ్‌ రాలేదని జాయిన్‌ కాలేదు. తిరిగి మళ్లీ పీహెచ్‌సీల్లోకే వచ్చేశారు. అలా 150 మందిపైగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి వారందర్నీ గుర్తించాల్సి న బాధ్యత డీహెచ్‌దే. అయితే ఆ విభాగాధిపతి, సంబంధిత అఽధికారుల నిర్లక్ష్యం కారణంగా పీజీలు చేసిన వైద్యులు పీహెచ్‌సీల్లోనే పని చేస్తున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 02:21 AM