వైద్య పాఠాలు చెప్పే అధ్యాపకులేరి?
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:21 AM
తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్ర స్థాయికి చేరిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా వైద్య కళాశాలల సంఖ్య పెరిగినప్పటికీ..
రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీల్లోని 27 విభాగాల్లో అధ్యాపకులే లేని వైనం
70 శాతం విభాగాల్లో ప్రొఫెసర్లు లేనే లేరు.. 150కి పైగా విభాగాల్లో సీనియర్ సిబ్బంది కొరత
అన్ని చోట్లా కాంట్రాక్ట్ అధ్యాపకులపైనే ఆధారం.. టీఎస్‌ఆర్‌డీఏ సర్వేలో విస్తుపోయే అంశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్ర స్థాయికి చేరిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా వైద్య కళాశాలల సంఖ్య పెరిగినప్పటికీ.. అవసరమైన స్థాయిలో అధ్యాపకుల నియామకాలు జరగలేదని, మెజారిటీ మెడికల్ కాలేజీల్లో అధ్యాపక ఖాళీల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీఎ్‌సఆర్‌డీఏ) చేపట్టిన సర్వేలో వెలుగులోకి వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 35 వైద్య కళాశాలల్లో 27 విభాగాల్లో ఒక్క బోధనా అధ్యాపకుడు కూడా లేరని ఆ స్టడీ పేర్కొంది. అంటే.. ఇవి కేవలం కాగితాలపైనే విభాగాలుగా ఉన్నాయి. వాస్తవానికి ఎన్‌ఎంసీ 2023 మార్గదర్శకాల ప్రకారం యూజీ విద్య బోధించే(50ఎంబీబీఎస్ సీట్లు ఉండే) కాలేజీల్లో ప్రతీ విభాగానికి కచ్చితంగా ఇద్దరు నుంచి నలుగురు అధ్యాపకులు ఉండాలి. కానీ, రాష్ట్రంలోని భూపాలపల్లి మెడికల్ కాలేజీలో 4 విభాగాలు, గద్వాల కాలేజీలో 3 విభాగాలు, కొడంగల్‌లో 3విభాగాలు, జగిత్యాల, మెదక్, నిర్మల్, మహబూబాబాద్, రామగుండం, సూర్యాపేట, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట వైద్యకళాశాలల్లోని ఒక్కో విభాగంలో అధ్యాపకులే లేరని సర్వే వెల్లడించింది. ప్రత్యేకంగా ప్రీ క్లినికల్, పారా క్లినికల్ సబ్జెక్టుల్లో అనేక విభాగాల్లో బోధన సిబ్బంది లేరని తెలిపింది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 150 పైగా విభాగాల్లో సీనియర్ అధ్యాపకులు లేరని, ఈ విభాగాలు జూనియర్ అధ్యాపకులపైనే ఆధారపడి నడుస్తున్నాయని పేర్కొంది. ఒకవేళ జాతీయ వైద్య కమిషన్ భౌతిక తనిఖీలు జరిపితే గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని టీఎ్‌సఆర్‌డీఏ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, కొత్త పీజీ కోర్సులకు అనుమతులు రావని, ఉన్న సీట్లకు కోతపడే అవకాశం ఉందని పేర్కొంది.
70శాతం విభాగాల్లో ప్రొఫెసర్లే లేరు
రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా విభాగాల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేరని టీఎ్‌సఆర్‌ఏడీ అధ్యయనం తెలిపింది. ఉస్మానియా, గాంధీ, కాకతీయ వంటి పాత వైద్య కళాశాలల్లో మాత్రమే కొందరు ప్రొఫెసర్లు ఉన్నారని, కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో పరిస్థితి అధ్వానంగా ఉందని వెల్లడించింది. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ర్టీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ప్రివెంటివ్ మెడిసిన్ వంటి విభాగాల్లో ప్రొఫెసర్ల కొరత ఉందని విశ్లేషించింది. రాష్ట్రవ్యాప్తంగా 120పైగా విభాగాలు ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్‌తోనే నడుస్తున్నాయని తెలిపింది. అండర్‌గ్రాడ్యుయేట్ బోధన, అంతర్గత మూల్యాంకనం, యూనివర్సిటీ పరీక్షలు, పరిపాలనా పనులు, ల్యాబ్, క్లినికల్ పర్యవేక్షణ లాంటివన్నీ ఆ ఒక్కరే చూడాల్సి వస్తోందని తెలిపింది. అధ్యాపకుల కొరత కారణంగా ఎంబీబీఎస్ తొలి రెండేళ్లకు పునాది అయిన ప్రీ క్లినికల్, పారా క్లినికల్ విభాగాలు ఎక్కువగా నష్టపోతున్నాయని సర్వే అభిప్రాయపడింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎక్కువగా కాంట్రాక్టు అధ్యాపకులపైనే ఆధారపడి నడుస్తున్నాయని, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, కాంట్రాక్ట్ బాండెడ్ సీనియర్ రెసిడెంట్లపై అధిక ఆధారం పడుతోందని వెల్లడించింది. కొన్ని విభాగాలను తాత్కాలిక పద్ధతిలో నియమితులైన వారితోనే నడవడం ప్రమాదకరంగా మారిందని పేర్కొంది. కాగా, రాష్ట్రంలో సర్కారీ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు వైద్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే, ఒకేసారి ఎక్కువ కాలేజీలను ఏర్పాటు చేయడంతో భర్తీ చేద్దామన్నా అధ్యాపకులు దొరకని పరిస్థితి ఏర్పడిందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.
1900 పోస్టులను భర్తీ చేయబోతున్నాం
వైద్య కళాశాలల్లో 1900 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను దశల వారీగా భర్తీ చేయబోతున్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ జారీ అయింది. మరో 723 పోస్టులకూ ఆమోదం లభించింది, మరో 600 పోస్టులను ఆ తర్వాత భర్తీ చేయబోతున్నాం. ఆసిఫాబాద్, భద్రాచలం వంటి మారుమూల మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిజేసేందుకు ఆసక్తి చూపే అధ్యాపకులకు ‘యూ కోట్-వియ్ పే’ విధానంలో వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
- డాక్టర్ ఎ.నరేంద్రకుమార్, వైద్యవిద్య సంచాలకులు