Share News

భారీగా పన్ను రాబడి

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:07 AM

ఈ ఆర్థిక సంవత్సరం రెండో నెల అయిన ‘మే’లో.. రూ.15,494.93 కోట్ల పన్ను ఆదాయం రాష్ట్రానికి సమకూరింది. ప్రతి నెలా వసూలయ్యే పన్ను....

భారీగా పన్ను రాబడి

  • ‘మే’లో 15,494 కోట్ల రాక.. ఊతమిచ్చిన జీఎస్టీ

  • పన్నేతర ఆదాయమూభారీగానే.. 1,443 కోట్లు

  • పాత అప్పుల కిస్తీ, వడ్డీలకే సరిపోతున్న కొత్త రుణం

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఈ ఆర్థిక సంవత్సరం రెండో నెల అయిన ‘మే’లో.. రూ.15,494.93 కోట్ల పన్ను ఆదాయం రాష్ట్రానికి సమకూరింది. ప్రతి నెలా వసూలయ్యే పన్ను రాబడి కంటే ఎక్కువ ఇది. ఇక పన్నేతర రాబడి రూ. 1443.87 కోట్లు వచ్చింది. ఏప్రిల్‌లో పన్నేతర రాబడి రూ.359 కోట్లు మాత్రమే.

మే నెలలో భూముల అమ్మకం ద్వారా పన్నేతర రాబడి పెరిగినట్లు తెలుస్తోంది. అయితే... మే నెలలో సర్కారు తీసుకున్న అప్పుల తాలూకూ సొమ్ము గత అప్పుల కిస్తీలు, వడ్డీలకు హరించుకుపోవడమే కాకుండా... అదనంగా ప్రభుత్వమే తన ఖజానా నుంచి చెల్లించాల్సి వచ్చింది. రాష్ట్ర ఆదాయ, వ్యయాలకు సంబంధించి ‘కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)’ గురువారం మే నెల నివేదికను విడుదల చేసింది. జీఎ్‌సటీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, సేల్స్‌ ట్యాక్స్‌, రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకాలు, కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర పన్నులు-సుంకాలు కలిపి ఏప్రిల్‌ నెలలో రూ.10,598.33 కోట్లు సమకూరగా.. మే నెలలో రూ.15,494.93 కోట్లు రావడం గమనార్హం. ప్రతి నెలా రాష్ట్ర ఖజానకు సగటున రూ.13 వేల కోట్ల పైచిలుకు పన్ను రాబడి ఉంటుంది. కానీ... మే నెలలో ఏకంగా రూ.15 వేల కోట్ల మార్కు దాటడం గమనార్హం. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లో పెరుగుదల నమోదు కావడం వల్లే పన్ను రాబడి ఎక్కువగా వచ్చినట్లు అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఏప్రిల్‌లో జీఎస్‌టీ) కింద రూ.3,155 కోట్లు రాగా.. మే నెలలో రూ.6,536 కోట్లు సమకూరాయి.


చేతికి రాని అప్పుల సొమ్ము...

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా బహిరంగ మార్కెట్‌ రుణాలు తీసుకుంటున్నప్పటికీ... చేతికందుతోన్న నికర సొమ్ము తక్కువేనని చెప్పవచ్చు. మే నెలలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. గత నెలలో తీసుకున్న అప్పు... పాత అప్పులను తీర్చడానికే హరించుకుపోవడం గమనార్హం. ఏప్రిల్‌ నెలలో తీసుకున్న అప్పులో ప్రభుత్వానికి రూ.11,413.93 కోట్లు నికరంగా చేతికందాయి. మే నెలలో మరో రూ.6000 కోట్ల అప్పును సేకరించింది. కానీ... ఈ సొమ్ము పాత అప్పుల కిస్తీలు, వడ్డీలకే కట్‌ అయినట్లు ‘కాగ్‌’ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ఇవి పోనూ... అదనంగా ప్రభుత్వం ఖజానా నుంచే మరో రూ.817 కోట్ల సొమ్మును చెల్లించింది. ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి ప్రభుత్వానికి అందిన అప్పుల నికర సొమ్ము రూ.10,595.98 కోట్లు. ఇలా పన్నులు, పన్నేతరాలు, కేంద్ర గ్రాంట్లు, అప్పులన్నీ కలిపి రాష్ట్రానికి మే నెల నాటికి రూ.39,045.24 కోట్లు రాబడి సమకూరింది. ఇందులోంచి అన్ని పద్దుల కింద రూ.37,412.33 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. సంక్షేమ పథకాలకు రూ.9,929.84 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.4,658.27 కోట్లు, ఉద్యోగుల జీత భత్యాలకు రూ.8,324.21 కోట్లు, పెన్షన్లకు రూ.4,758.64 కోట్లు, సబ్సిడీలకు రూ.5,809.01 కోట్లు ఖర్చుపెట్టింది.

Updated Date - Jun 19 , 2026 | 03:07 AM