గణపతీ లొంగిపొండి!
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:00 AM
అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
పూర్తిగా ఉచిత వైద్య చికిత్స అందిస్తాం
మిగిలిన మావోయిస్టులంతా జనంలోకి రావాలి
లొంగిపోయిన వారికి ఇల్లు, ఆరోగ్య భద్రత కార్డు
ఆత్మగౌరవంతో బతికే వాతావరణం కల్పిస్తాం
కేసుల ఎత్తివేతపై ఉన్నతస్థాయి కమిటీ వేస్తాం
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కండి
రాజకీయాల్లోకి వస్తే సంతోషం: రేవంత్‌రెడ్డి
సీఎం ముందు 130 మంది నక్సల్స్ లొంగుబాటు
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. లొంగిపోతే ఆయనకు అవసరమైన అన్ని రకాల వైద్య చికిత్సలనూ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. నక్సలైట్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుభూతితో ఉందని చెప్పారు. వారిపై కేసుల తీవ్రతను పరిశీలించి వేటిని ఎత్తేయవచ్చో నిర్ణయించడానికి ఉన్నత స్థాయి కమిటీని వేస్తున్నట్లు ప్రకటించారు. మావోయిస్టు పార్టీకి చెందిన 130 మంది మావోయిస్టులు శనివారం ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోయారు. అత్యంత అధునాతనమైన 124 ఆయుధాలు, వేలకొద్దీ తూటాలను పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇంత భారీ ఎత్తున ఆయుధాలతో మావోయిస్టులు లొంగిపోయిన ఘటన దేశంలోనే తొలిసారని అన్నారు. అటు పోలీసులు కానీ, ఇటు మావోయిస్టులు కానీ ప్రాణం కోల్పోవడం తమ ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే మావోయిస్టు అగ్రనేత సహా తెలంగాణకు సంబంధించిన మిగిలిన ఏడుగురు మావోయిస్టు నాయకులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడంతోనే మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, రాజిరెడ్డి, దామోదర్, గంగన్న తదితరులు లొంగిపోయారని చెప్పారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, వారి కోసం నిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు ఇతర ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందేలా ఆరోగ్య భద్రత కార్డులను ఇస్తామని చెప్పారు.

లొంగిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ప్రకటించారు. అయితే, వారి కోరినట్లు వ్యవసాయానికి భూములు ఇవ్వలేమని స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు ఆత్మగౌరవంతో బతికే విధంగా కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల వారు వచ్చినా లొంగుబాటుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం పోరాటాలు చేసిన మావోయిస్టులు ఇక ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని, తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. నక్సలైట్ పార్టీలో పనిచేసిన సీతక్క మంత్రి అయ్యారని, మాజీ మావోయిస్టులు వివిధ పదవుల్లో ఉన్నారని ప్రస్తావించారు. లొంగిపోయిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరదలచుకుంటే గాంధీభవన్‌కు వెళ్లి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలవాలని సూచించారు. అలా వచ్చే వారికి పార్టీ స్వాగతం చెబుతుందన్నారు. మావోయిస్టులే బయటకు వచ్చాక ఆ పార్టీపై నిషేధం ఉన్నా లేకున్నా ఒకటేనని, ఆయుధాలు పట్టిన వారి కోసమే ఈ నిషేధమని చెప్పారు.
పార్టీని రద్దు చేస్తామన్నారు
ఇటీవల లొంగిపోయిన దేవ్‌జీ, దామోదర్, రాజిరెడ్డి, గంగన్న ఇతర మావోయిస్టు నేతలతో ఇటీవల సచివాలయంలో సమావేశమయ్యానని, వారు కొన్ని ప్రతిపాదనలను తన ముందుంచారని ముఖ్యమంత్రి తెలిపారు. వారి ప్రతిపాదనలను తాను యథాతథంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముందుంచానని వెల్లడించారు. వారి ఆవేదన, ఆలోచనలను తాను అర్ధం చేసుకున్నానన్నారు. జైళ్లల్లో ఉన్న మావోయిస్టులను విడుదల చేయాలని, కేసుల విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలని, అడవుల్లో ఉన్న వారి ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని హమీ ఇవ్వాలని వారు కోరారని సీఎం వెల్లడించారు. వాటికి అంగీకరిస్తే తాము మావోయిస్టు పార్టీని రద్దు చేసి రాజకీయాల్లోకి వస్తామని చెప్పారన్నారు. చాలా విషయాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున వాటిని అమిత్‌షా దృష్టికి తీసుకుని వెళ్లానని తెలిపారు. ఆయుధాలు వీడితే అన్నీ అవే పరిష్కారం అవుతాయని అమిత్‌షా చెప్పారన్నారు. లొంగిపోయినందుకు ఇచ్చే రివార్డులు తాము గౌరవంగా బతికే విధంగా ఉండాలని మావోయిస్టు నేతలు కోరారన్నారు. అయితే, మావోయిస్టు అగ్రనేతలపై ఉన్న రివార్డులు 1993లో ఏర్పాటయిన కమిటీ నిర్ణయించినవని, లొంగిపోయిన వారికి అవి సరిపోవని ముఖ్యమంత్రి అంగీకరించారు. వారి పునరావాసానికి సంబంధించి తగు భరోసాను ఇతర మార్గాల్లో చూపిస్తామని చెప్పారు. ఇంత భారీ స్ధాయి లొంగుబాటుకు కారణమైన డీజీపీ శివధర్‌రెడ్డి, ఎస్‌ఐబీ ఐజీ సుమతిలను రేవంత్‌రెడ్డి అభినందించారు.
రాష్ట్ర కమిటీ మాయమైంది: డీజీపీ
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అంతర్ధానమైందని, ఇంకా అందులో ఎవరు లేరని డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటించారు. ఉన్నత నాయకత్వం లొంగిపోయిన నేపఽథ్యంలో ఆయుధాలతో అడవుల్లో చెల్లాచెదరైన మావోయిస్టు దళ సభ్యులను వెతికి పట్టుకుని లొంగిపోవడానికి తీసుకుని వచ్చామని చెప్పారు. శనివారం లొంగిపోయిన 130 మందిలో 125 మంది ఛత్తీస్‌గఢ్ కు చెందిన వారని, తెలంగాణకు చెందిన వారు ఐదుగురని వివరించారు. రాష్ట్ర కమిటీ నాయకులు ముగ్గురు, రీజనల్ కమిటీ సభ్యుడు ఒకరు, డివిజన్ కమిటీ నాయకులు పది మంది, ఏరియా కమిటీ సభ్యులు 46 మంది, 70 మంది దళ సభ్యులు ఉన్నారని వెల్లడించారు. పీఎల్‌జీఎ మొదటి బెటాలియన్‌కు చెందిన 42 మంది, తెలంగాణ కమిటీలోని 30 మంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోని 32 మంది, సెంట్రల్ రీజనల్ కమాండ్ కంపెనీకి చెందిన 16 మంది, కేంద్ర కమిటీ సభ్యుల వ్యక్తిగత సిబ్బంది పదిమంది లొంగిపోయిన వారిలో ఉన్నారని శివధర్ రెడ్డి వివరించారు. తెలంగాణలో 2024 నుంచి ఇప్పటి వరకు 721 మంది మావోయిస్టులు 266 ఆయుధాలతో లొంగిపోయారన్నారు. ఇదీ దేశ చరిత్రలోనే అత్యుత్తమమైనదని చెప్పారు. లొంగిపోయిన వారిలో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 19 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజనల్ కమిటీ సభ్యుడు, 36 మంది డివిజనల్ కమిటీ నాయకులు, 131 మంది ఏరియా కమిటీ నాయకులు, 530 మంది దళ సభ్యులు ఉన్నారన్నారు.
స్వాధీనం చేసుకున్న ఆయుధాలివే
ఒక లైట్ మిషన్ గన్, 31 ఏకే 47 రైఫిళ్లు, 21 ఇన్సాస్ రైఫిళ్లు, 20 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, 18 పాయింట్ 303 రైఫిళ్లు, ఒక 9 ఎంఎం కార్బయిన్, ఒకటి 7.62 బోల్ట్ యాక్షన్ రైఫిల్, రెండు 8 ఎంఎం బోల్ట్ యాక్షన్ రైఫిళ్లు, 18 సింగల్‌షాట్ తుపాకులు, రెండు పిస్టళ్లు, ఒకఅమెరికా తయారీ కార్బయిన్, ఒక ఎఫ్‌ఏఎల్ రైఫిల్, రెండు బీజీఎల్, ఒక స్టెన్ కార్బయిన్, నాలుగు ఎయిర్‌గన్స్, 5205 తూటాలు.
నవతకు 20 లక్షలు
లొంగిపోయిన మావోయిస్టుల్లో రీజనల్ కమిటీ సభ్యురాలు చలసాని నవతకు రూ.20 లక్షలు, డివిజన్ కమిటీ సభ్యుడు అనిల్ కుమార్, భవాని, మాడ్వి అడిమేలకు ఒకొక్కరికి రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.12 లక్షలు, రాష్ట్ర కమిటీ సభ్యుడు బడిసే ఉంగయ్యకు రూ.20 లక్షల రివార్డును సీఎం రేవంత్‌రెడ్డి అందచేశారు. ఇతర దళసభ్యులకు లక్ష రూపాయల చొప్పున ఒకొక్కరికి డీజీపి శివధర్‌రెడ్డి రివార్డును ఇచ్చారు. ఆయుధాలకు సంబంధించి ఎల్‌ఎంజీకి రూ.5 లక్షలు, ఏకే 47కి రూ.4 లక్షలు, ఇన్సాస్, ఎస్‌ఎల్‌ఆర్‌లకు రూ.2 లక్షలు, పాయింట్ 303 రైఫిళ్లకు లక్ష రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వ ప్రొత్సాహక బహుమతులను డీజీపీ అందచేశారు. మొత్తం 4.18 కోట్ల రివార్డులను అందజేశారు.