బంగారం, ఆయుధాల డంప్‌లు ఎక్కడ?
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:36 AM
ఇటీవల తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మరికొన్నాళ్లు పోలీసుల అదుపులోనే ఉండే పరిస్థితులు కన్పిస్తున్నాయి.
క్యాడర్ పరిస్థితి, పార్టీలోని చివరి దశ పరిణామాలపైనా ప్రశ్నలు!
మావోయిస్టు పార్టీ గుట్టుమట్లపై గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్న నిఘా బృందాలు
మరికొద్ది రోజులు పోలీసుల అదుపులోనే మావోయిస్టు అగ్రనేతలు
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఇటీవల తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మరికొన్నాళ్లు పోలీసుల అదుపులోనే ఉండే పరిస్థితులు కన్పిస్తున్నాయి. మావోయిస్టు పార్టీలో కీలకమైన పొలిట్‌బ్యూరో సభ్యులు, మిలటరీ కమిషన్ ఇన్‌చార్జి, కేంద్ర కమిటీ సభ్యులైన మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని విచారించడానికి పలు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా), ఆర్మీ ఇంటెలిజెన్స్‌తో పాటు కేంద్ర సాయుధ బలగాలైన సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్ తదితర విభాగాలకు చెందిన నిఘా బృందా లు దేవ్‌జీ, రాజిరెడ్డిని పలు విషయాలపై ప్రశ్నిస్తున్నాయి. లొంగిపోయిన నూనె నర్సింహరెడ్డి అలియాస్ గంగన్న, బడే చొక్కారావును సైతం దర్యాప్తు బృందాలు వేర్వేరుగా ప్రశ్నిస్తున్నాయి. మావోయిస్టు పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో నిర్ణయాలు, చర్యలు, పార్టీ నిర్వహణ, ఆర్థిక వనరులు, ఆయుధాలు, అంతర్జాతీయ సంబంధాలు, లింకులు, ఆయుధాల సరఫరా వ్యవస్థలు, ఆయుధాల ఏజెంట్లు, మిగిలిన క్యాడర్ వివరాలు గురించి కేంద్ర బృందాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ గత ఏడాది ఎన్‌కౌంటర్‌లో మరణించిన తర్వాత అనధికారికంగా పార్టీ పగ్గాలు చేపట్టిన దేవ్‌జీ పార్టీ నిర్వహణ బాధ్యతలు నిర్వహించిన క్రమంలో పార్టీ ఆదాయం, ఆర్థిక వనరులు గురించి ఆయనకు కీలక సమాచారం తెలిసే ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
మావోయిస్టు పార్టీ వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలతోపాటు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో పట్టుబడిన ఒక మా వోయిస్టు అగ్రనేత లొంగుబాటు తర్వాత మీడియా తో మాట్లాడుతూ.. తాను పార్టీ నుంచి బయటకు వచ్చే సమయంలో రూ.ఆరు కోట్ల విలువైన బంగా రం, భారీగా నగదు పార్టీకి అప్పగించి వచ్చామని పేర్కొన్నారు. తెలంగాణలో ఇటీవలి కాలంలో మావోయిస్టు నేత, పీఎల్‌జీఏ కమాండర్ బార్సేదేవా పట్టుబడిన సమయంలో తెలంగాణ చరిత్రలోనే మొదటి సారిగా మావోయిస్టు డంప్ నుంచి రూ.20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 48 అత్యంత అధునాతన ఆయుధాలు పోలీసులకు మావోయిస్టులు అప్పగించారు. మావోయిస్టు పార్టీ గతంలో కాంట్రాక్టర్ల నుంచి కొంత డబ్బు వసూలు చేసిందనేదీ బహిరంగ రహస్యమే. పార్టీ నిర్వహణకు సేకరించిన డబ్బు నిర్వహణ కష్టంగా మారడంతో కరోనాకు ముందు పెద్దఎత్తున బంగారు బిస్కెట్లను పార్టీ కొని డంప్‌ల్లో దాచిందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దాదాపు రూ.500 కోట్ల బంగారం మావోయిస్టు పార్టీ వద్ద ఉందనే అనుమానాలను నిఘావర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ స్థాయిలో కాకున్నా కనీసం రూ.100 కోట్ల విలువైన బంగారం నిల్వల సంగతైనా అగ్రనాయకులకు తెలిసి ఉంటుందనే అనుమానాల నేపథ్యంలో అధికారులు దేవ్‌జీ నుంచి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆయుధాల డంప్ లు, ఆయుధాల నిల్వల వివరాలను తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.