Share News

తిప్పిరి తిరుపతి లక్ష్యంగా పోలీసుల వేట

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:12 AM

మార్చి ఆఖరు లోపు మావోయిస్టుల కఽథ ముగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశాలు.. అప్పటి వరకు ఒక్కరైనా బతకాలనేది మావోయిస్టు పార్టీ నాయకుల ఆలోచన..

తిప్పిరి తిరుపతి లక్ష్యంగా పోలీసుల వేట

  • అడవులను జల్లెడ పడుతున్న పోలీసు దళాలు

  • లొంగిపోయి.. అభివృద్ధిలో భాగస్వాములుకండి

  • మావోయిస్టు నాయకత్వానికి డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మార్చి ఆఖరు లోపు మావోయిస్టుల కఽథ ముగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశాలు.. అప్పటి వరకు ఒక్కరైనా బతకాలనేది మావోయిస్టు పార్టీ నాయకుల ఆలోచన.. ఈ క్రమంలో ఒక్కొక్క నాయకుడినీ టార్గెట్‌ చేస్తూ కేంద్ర, రాష్ట్ర పోలీసు దళాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. గడువు ముంచుకొస్తున్న క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవలే రాయ్‌పూర్‌లో వివిధ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. లొంగుబాట్లు లేదా ముగింపు తప్పదనే హెచ్చరిక స్పష్టంగా వెళ్లాలని పేర్కొన్న నేపథ్యంలో తెలంగాణకు చెందిన 15మంది మావోయిస్టు నాయకులు లొంగిపోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి మరోసారి పిలుపునిచ్చారు. తిప్పిరి తిరుపతితోపాటు ఇతర అగ్రనాయకత్వం లొంగుబాటు అవకాశాన్ని వినియోగించుకుని తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హమీ మేరకు లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పునరావాసంతోపాటు సమాజంలో ఆత్మగౌరవంతో బతకడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌, పుసునూరి నరహరి అలియాస్‌ సంతోష్‌, ముప్పిడి సాంబయ్య, వార్త శేఖర్‌, జోడే రత్నభాయి, బడే చొక్కారావు మాత్రమే మిగిలి ఉన్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరు కాకుండా డీసీఎం ఇతర స్థాయి నాయకులైన నక్కా సుశీల, జాడి పుష్ప. భాగ్య, సంగీత, భవానీ, కుంజం ఇడుమల్‌, అనిల్‌కుమార్‌ సైతం పోలీసుల వాంటెడ్‌ జాబితాలో ఉన్నారు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి(70) నడవలేని పరిస్థితుల్లో ఉండగా, ఆయనను పార్టీ నాయకత్వం సురక్షిత ప్రాంతంలో ఉంచిందా? లేక నేపాల్‌ మీదుగా విదేశాలకు పంపించిందా? అనేది తెలియడం లేదు. ఇటీవల పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయినప్పటికి గణపతి, రాజిరెడ్డి, జోడేభాయిలకు సంబఽంధించిన సమాచారం తెలియదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ నాయకత్వ బాధ్యతలు వహిస్తున్న తిప్పిరి తిరుపతి, ఆయన వెంట ఉన్న సాయుధ మావోయిస్టులే లక్ష్యంగా పోలీసు బలగాల వేట కొనసాగుతోంది.

Updated Date - Feb 16 , 2026 | 02:12 AM