క్యూఆర్ కోడ్‌తో రిఫ్లెక్టివ్ టేపులు
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:48 AM
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రాత్రి సమయాల్లో రహదారులపై సరుకు రవాణా వాహనాలు స్పష్టంగా కనిపించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాత్రివేళల్లో ప్రమాదాల నివారణకు రవాణా వాహనాల కోసం నిర్ణయం
రియర్ మార్కింగ్ ప్లేట్లు కూడా.. టేపులపై రవాణా శాఖ లోగో, హోలోగ్రామ్
ఈ నెల 20 నుంచి వాహనాలకు తప్పనిసరి..
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రాత్రి సమయాల్లో రహదారులపై సరుకు రవాణా వాహనాలు స్పష్టంగా కనిపించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మోటారు వాహనాల నియమాలు, 1989లోని రూల్ 104 - 104(ఈ) ప్రకారం రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లు అమర్చడం తప్పనిసరి చేసింది. రిఫ్లెక్టివ్ టేపులు నాణ్యతా ప్రమాణాలు లేకుండా ఏర్పాటు చేయడం వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు రావనే ఉద్దేశంతో నిబంధనల మేరకు రిఫ్లెక్లివ్ టేపుల సరఫరా కోసం ఐదు కంపెనీలను ప్రభుత్వం ఎంపిక చేసింది. వాహనాలపై క్యూఆర్ కోడ్ ఆధారిత మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) ధ్రువీకరణ విధానాన్ని అమలు చేయనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. క్యూఆర్ కోడ్ ఆధారిత రిఫ్లెక్టివ్ టేపుల విధానం ఫిబ్రవరి 20న రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుందని వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దరఖాస్తులను పరిశీలించి టేపుల సరఫరా కోసం ఒరఫోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 3ఎం ఇండియా లిమిటెడ్, గ్లోడియన్ రిఫ్లెక్టివ్ ప్రైవేట్ లిమిటెడ్ (రిఫ్లోమాక్స్), డైమింగ్ రిఫ్లెక్టివ్ మెటీరియల్ ఇండియా ప్రేవేట్ లిమిటెడ్, అవెరి డెన్నిసన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను ఎంపిక చేశారు. ఆ కంపెనీలు మినహా ఇతర కంపెనీలు, సంస్థలు, వ్యక్తుల రిఫ్లెక్టివ్ టేపులు, రీర్ మార్కింగ్ ప్లేట్లు విక్రయించేందుకు, అమర్చేందుకు అనుమతి లేదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. రిఫ్లెక్ట్ టేపులు అమర్చేందుకు కాగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి వసూలు చేసే కంపెనీల ఎంపానెల్ రద్దు చేయడంతోపాటు బ్యాంకు గ్యారెంటీని స్వాధీనం చేసుకుంటామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. వాహన యజమానులు ఎంపానెల్ చేసిన సంస్థల అధీకృత డీలర్ల వద్ద మాత్రమే రిఫ్లెక్టివ్ టేపులు అమర్చుకోవాలని సూచించారు.
అమలు విధానం
ఎంపిక చేసిన కంపెనీలు తమ అధీకృత డీలర్లు/అప్లికెటర్లతో రవాణా వాహనాలకు టేపులు అమర్చాలి.
టేపులపై తెలంగాణ రవాణా శాఖ లోగోతో కూడిన హోలోగ్రామ్, ప్రత్యేక సీరియల్ నంబర్‌తో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలి.
టేపులు అమర్చిన తర్వాత ‘అఫిక్సేషన్ సర్టిఫికెట్’ జారీ చేయాలి.
సర్టిఫికెట్‌లో వాహన వివరాలు, రెండేళ్ల వారంటీ వివరాలుండాలి.
వాహనం ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌కు ధ్రువీకరణ తప్పనిసరి.
రూల్ 104-104(ఈ) ప్రకారం రిఫ్లెక్ట్ టేపులు తప్పనిసరి అయిన వాహనాలకు క్యూఆర్ ఆధారిత ఽధ్రువీకరణ లేకుండా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయరని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు.
సర్క్యులర్ జారీ అయ్యాక 3 నెలల వరకు పరిమితి మినహాయింపు
3 నెలల తర్వాత క్యూఆర్ ధ్రువీకరణ పూర్తి తప్పనిసరి.
అఫిక్సేషన్, సర్టిఫికెట్ చార్జీలు కలుపుకొని ప్రభుత్వం నిర్ణయించిన టేపుల ధరలు ఈ విధంగా ఉన్నాయి
సీటీ 20ఎంఎం(మీటరుకు) రూ.79.80 నుంచి 85.
సీటీ 50ఎంఎం(మీటరుకు) రూ.145 నుంచి 151.80.
సీ3(జతకు) రూ. 2500 నుంచి 2650 వరకు.
సీ4(జతకు) రూ. 2800 నుంచి 2900 వరకు.
రిఫ్లెక్టర్లు 40 ఎంఎం రూ. 35.
రిఫ్లెక్టర్లు 80 ఎంఎం రూ. 60.