ఆహా.. ఒకటో తారీఖు!
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:22 AM
రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగులు ఖుషీ అవుతున్నారు! ఇప్పటిదాకా 13-14 తేదీల్లో.. లేదంటే నెల, రెండు నెలలకో పడే జీతం డబ్బులు, ఈసారి ఒకటో తేదీనే...
ఒప్పంద ఉద్యోగులకు నెల తొలిరోజే జీతాలు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి
కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హర్షం
రాష్ట్రంలో 4.98 లక్షల మంది ఒప్పంద ఉద్యోగులు
విభాగాధిపతుల సమన్వయ లోపంతో జాప్యం
1వ తేదీనే ఇవ్వాలని జూన్ 15న సర్కారు ఉత్తర్వులు
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగులు ఖుషీ అవుతున్నారు! ఇప్పటిదాకా 13-14 తేదీల్లో.. లేదంటే నెల, రెండు నెలలకో పడే జీతం డబ్బులు, ఈసారి ఒకటో తేదీనే (బుధవారం) ఖాతాలో పడ్డాయి. ఇక నుంచి ఒకటో తారీఖునే పడనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు ఆర్థిక శాఖ బుధవారం ఉద్యోగుల జీతాలను విడుదల చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక ఒప్పంద ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అందడం ఇదే మొదటిసారి. దీంతో ఇది కలా.. నిజమా? అని ఒప్పంద ఉద్యోగులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. రాష్ట్రంలో 4.98 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మెజారిటీ శాఖల్లో పనిచేసే ఒప్పంద ఉద్యోగులకు జూలై 1నే ఖాతాల్లో వేతనాలు పడ్డాయి. వాస్తవానికి కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగులకు రెండుమూడు రకాలుగా వేతనాలుంటాయి. ఒకటి.. నేరుగా సర్కారే చెల్లించడం, రెండోది.. అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా చెల్లించడం! ఈ రెండు పద్ధతుల్లోనూ వేతనాలు ఎప్పుడూ ఆలస్యమే అవుతుంటాయి. ముఖ్యంగా అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల కింద ప్రభుత్వ శాఖల్లో పనిజేసే ఒప్పంద ఉద్యోగులకు రెండు, మూడు నెలలు గడిస్తే తప్ప వేతనాలు రావు! దీంతో వారు తరచూ ఆందోళనలు చేస్తున్నారు. దీనికి చెక్ పెట్టాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. గత నెల 15న ఓ సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ శాఖల్లో పనిజేసే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని అందులో పేర్కొంది. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల విభాగాధిపతులకు సూచించింది. దీనికి మెజారిటీ శాఖల విభాగాఽధిపతులు స్పందించారు. తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. మునిసిపాలిటీ, అటవీశాఖ, మహిళాశిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిజేసే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం జూలై 1న వేతనాలు పడలేదని సమాచారం. కాగా సకాలంలో స్పందించని విభాగాధిపతులపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలని, ఒప్పంద ఉద్యోగులకు వేతనాలు ఆలస్యం కాకుండా చూసే బాధ్యత తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఆలస్యాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం
ఒప్పంద ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ఆలస్యం కారణంగా వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించినట్లు సీఎంవో పేర్కొంది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, హానరోరియం ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి కూడా ప్రతి నెల జీతాలు ఆలస్యం లేకుండా అందించాలని ఇటీవలే అధికారులను ఆదేశించారని తెలిపింది. సీఎం ఆదేశాల అమలులో భాగంగా ఆర్థికశాఖ ఇటీవల అన్ని శాఖలు, విభాగాలకు సర్క్యులర్ జారీ చేసినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. జీతాల చెల్లింపుల వివరాలపై ముఖ్యమంత్రి బుధవారం ఆర్థిక శాఖ అధికారులను ఆరా తీశారు. ఈ నెల బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగులకు బుధవారం జీతాలు జమ చేసినట్లు ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.
ఇది అస్సలు ఊహించలేదు
ఒప్పంద ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం గత నెలలో ఉత్తర్వులిచ్చింది. అయితే తక్షణమే దాన్ని అమలు చేస్తారని అస్సలు ఊహించుకోలేదు. ఇచ్చిన మాటను ప్రభుత్వం పదిహేను రోజుల్లోనే నిలబెట్టుకుంది. జూలై 1న మెజారిటీ శాఖల్లోని కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలందాయి. ఇది ఎంతో సంతోషకర విషయం. సకాలంలో జీతాలు రావడమనేది మా అందరి కుటుంబాల్లో ఎంతో ఆనందానిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
- పులి లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్