ఈ మక్కలు మాకొద్దు!
ABN , Publish Date - May 21 , 2026 | 03:42 AM
నాణ్యత ప్రమాణాలు పరిశీలించి కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన మక్కలను.. గోదాముల ఇన్‌చార్జులు తిరస్కరిస్తున్నారు. మొక్కజొన్నలు నాణ్యంగా లేవని, గోదాముల్లో దిగుమతి చేసుకునేదిలేదని...
నాణ్యంగా లేవంటూ కొర్రీలు
లారీలను తిప్పిపంపుతున్న గోదాముల ఇన్‌చార్జులు
రైతులకు తప్పని ఇబ్బందులు
హైదరాబాద్/సిద్దిపేట రూరల్, మే 20 (ఆంధ్రజ్యోతి): నాణ్యత ప్రమాణాలు పరిశీలించి కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన మక్కలను.. గోదాముల ఇన్‌చార్జులు తిరస్కరిస్తున్నారు. మొక్కజొన్నలు నాణ్యంగా లేవని, గోదాముల్లో దిగుమతి చేసుకునేదిలేదని లారీలను తిప్పి పంపిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి కొనుగోలు కేంద్రాల వరకు మక్కలు తీసుకెళ్లటం వరకే రైతుల బాధ్యత ఉంటుంది. కానీ గోదాముల్లో దిగుమతి చేసేంతవరకు కూడా రైతులనే బాధ్యులను చేస్తున్నారు.మక్కల్లో 14 శాతానికి మించి తేమ ఉంటే.. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కనీస మద్దతు ధరను తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 45 డిగ్రీల ఎండ నమోదవుతోంది. దీంతో తేమ సమస్యలు రావటంలేదు. తిరస్కరించటానికి ప్రధాన కారణం దొరకకపోవటంతో.. దుమ్ము(డస్ట్) ఉన్నదానే సాకుచూపి గోదాముల ఇన్‌చార్జులు లారీల్లో వచ్చిన మక్కల లోడును దించుకోవటంలేదు. నాణ్యత ఉందా? లేదా? అనేది కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే నిర్ణయిస్తారు. కాని విచిత్రంగా గోదాముల ఇన్‌చార్జులు మక్కలను తిరస్కరిస్తుండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. తమకు కేటాయించిన గోదాముల ఇన్‌చార్జులు లారీలను తిప్పి పంపితే.. సెంటర్ల నిర్వాహకులు మళ్లీ వేరే జిల్లాలోని గోదాములకు ఆ లారీలను పంపిస్తున్నారు. దీంతో రవాణా ఖర్చుల భారం రైతులపై పడుతోంది. అదనపు రవాణా ఖర్చుల కింద క్వింటాలుకు రూ.150 చొప్పున లారీ డ్రైవర్లు వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా మార్క్‌ఫెడ్ అధికారులు స్పందించి గోదాముల్లో మక్కలు దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, తమను ఇబ్బందులు పెట్టొద్దని రైతులు వేడుకుంటున్నారు. కాగా, ఈ యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మక్కలు సేకరించినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, నిర్మల్ జిల్లాల్లో హమాలీల కొరత, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో రవాణా సమస్యలతో కొనుగోళ్లు నిదానంగా సాగుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ధాన్యం కోసం లారీ ఆపితే తగలబెట్టుకుంటా..
పోలీసులను హడలెత్తించిన ఓ లారీ డ్రైవర్
‘ధాన్యం తరలింపు కోసం లారీ ఆపితే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటా.. లేదంటే నా లారీని తగలబెట్టుకుంటా. లారీకి సంబంధించి ఈఎంఐలు మీరు కడుతారా?’ అంటూ ఓ లారీ డ్రైవర్ పోలీసులను ప్రశ్నిస్తూ హడలెత్తించాడు. మంగళవారం రాత్రి సిద్దిపేట పోలీసుల ఆధ్వర్యంలో మందపల్లి స్టేజీ వద్ద ఖాళీగా వెళ్తున్న లారీలను ఆపి, కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లాకు చెందిన లారీని ఆపారు. లారీలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని.. కిరాయి డబ్బులు ఇస్తామని పోలీసులు డ్రైవర్‌కు సూచించారు. దీంతో డ్రైవర్ లారీలోని పెట్రోల్ బాటిల్ తీసుకువచ్చి.. ఒంటిపై పోసుకొని కాల్చుకుంటానని బెదిరించడంతో.. పోలీసులు చేసేదేమీ లేక లారీని వదిలిపెట్టారు. మరో ఘటనలో సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడులోని స్థానిక శివపార్వతి రైస్ మిల్ గోదాం నంబర్ 8బీకి ధాన్యం లోడుతో ఉన్న ఓ డీసీఎంను పంపించారు. అక్కడ ఎవరూ అన్‌లోడ్ చేసుకోకపోవడంతో డ్రైవర్ మళ్లీ డీసీఎంను కొనుగోలు కేంద్రానికే తీసుకొచ్చి.. వాహనానికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు.