పాత మక్కల వేలం పాట.. టన్నుకు 20 వేలు
ABN , Publish Date - May 30 , 2026 | 04:44 AM
మార్క్‌ఫెడ్ గోదాముల్లో నిల్వ ఉన్న పాత (గడిచిన వానాకాలం) మక్కలకు డిమాండ్ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు టెండర్లు రద్దు చేసి, సిండి‘కేటుగాళ్ల’కు చెక్ పెట్టడానికి....
3.8 లక్షల టన్నులకు 760 కోట్ల ఆదాయం
2 సార్లు టెండర్ల రద్దుతో పెరిగిన డిమాండ్
మూడో టెండరుతో రూ. 228 కోట్లు పెరిగిన రాబడి
రూ.20 వేల వరకూ బిడ్డింగ్
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): మార్క్‌ఫెడ్ గోదాముల్లో నిల్వ ఉన్న పాత (గడిచిన వానాకాలం) మక్కలకు డిమాండ్ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు టెండర్లు రద్దు చేసి, సిండి‘కేటుగాళ్ల’కు చెక్ పెట్టడానికి అనుసరించిన వ్యూహం ఫలించింది. పెద్ద లాట్లను రద్దు చేసి, చిన్న లాట్లుగా విభజించి ట్రేడర్ల మధ్య పోటీ పెంచడంతో ప్రభుత్వం ఆశించిన ధర వచ్చింది. గడిచిన వానాకాలం సీజన్‌కు సంబంధించి మార్క్‌ఫెడ్ వద్ద 3,80,187 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు నిల్వ ఉన్నాయి! వీటిని ఈ- టెండరు పద్ధతిలో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి నెలలో గోదాములవారీగా టెండర్లు పిలిస్తే ట్రేడర్లంతా సిండికేట్‌గా ఏర్పడి ఒక్క బిడ్ కూడా దాఖలు చేయలేదు. దీంతో 3.80 లక్షల టన్నులను 5 లాట్లుగా విడదీసి, ఒక్కో లాటుకు 76 వేల మెట్రిక్ టన్నుల పరిమాణం కేటాయించి... ఏప్రిల్ నెలలో రెండోసారి టెండర్లు పిలిచారు. అప్పుడు ఐదు ప్రముఖ కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడ్డాయి. సగటున టన్నుకు రూ. 14 వేలు (క్వింటాలుకు రూ. 1,400) చొప్పున బిడ్డింగ్ ధర కోట్ చేశాయి. ఒక్కో కంపెనీ ఒక ఒరిజినల్ బిడ్, ఒక డమ్మీ బిడ్ దాఖలుచేశాయి. 5 లాట్లకు 10 బిడ్లు దాఖలుచేసి తలో లాటు పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒకవేళ బిడ్డర్లు కోట్ చేసిన రూ. 14 వేల చొప్పున (క్వింటాలుకు రూ.1400 చొప్పున) మక్కలు ఇచ్చేస్తే... ప్రభుత్వానికి కేవలం రూ. 532 కోట్ల ఆదాయం వచ్చేది. కనీస మద్దతు ధర (రూ.2,400) లెక్క ప్రకారం చూస్తే రూ. 380 కోట్ల నష్టం జరిగేది. ఇదిలా ఉండగా ఆ ఐదు కంపెనీల్లో రెండు కంపెనీలపై ఫిర్యాదులు వచ్చాయి. కేంద్రీయ భండార్, న్యాకాఫ్ అనే రెండు ఏజెన్సీలు ధాన్యం టెండర్లు దక్కించుకొని ఒక్క బస్తా లోడెత్తక పోవడంతో.. అవి ధరావతుగా చెల్లించిన రూ.69 కోట్లను ప్రభుత్వం స్వాధీనం (జప్తు) చేసుకుంది. ఇప్పుడు ఆ రెండు ఏజెన్సీలు మక్కల టెండర్లలో చొరబడిపోయాయి. బీఆర్‌ఎస్ హయాంలో ఒక కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన సిండికేట్ డాన్ చక్రం తిప్పారు. ఈ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ మే 4న ‘మక్కలకు అక్రమ టెండర్!’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. ధాన్యం టెండర్లలో అక్రమాలకు పాల్పడిన ఆ రెండు కంపెనీలతో మక్కల అగ్రిమెంటు చేసుకోవద్దని నిర్ణయించింది. ధర కూడా ఎమ్మెస్పీ కంటే క్వింటాలుకు రూ.1,000 తగ్గడంతో మొత్తం టెండర్లను రద్దు చేసింది. దీంతో సిండికేటుగాళ్ల ఆటలకు కళ్లెం పడినట్లయింది.
మూడోస్సారి..
మక్కల విక్రయానికి మార్క్‌ఫెడ్ ఇటీవల మూడోసారి టెండరు నోటిఫికేషన్ జారీచేసింది. టెండరు నిబంధనలు కూడా మార్చింది. 3.80 లక్షల టన్నులను 25 లాట్లుగా విభజించింది. మార్కెట్లో కూడా మక్కల డిమాండ్ పెరగటంతో రూ.19,500 నుంచి రూ.20 వేల బిడ్డింగ్ ధర వచ్చింది. దీంతో రూ. 760 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రానుంది. రెండోసారి టెండర్లు రద్దుచేయకపోతే రూ.532 కోట్ల ఆదాయమే వచ్చేది. అంటే 228 కోట్లు ఎక్కువ. టెండరు నిబంధనల ప్రకారం నెల రోజుల్లో డబ్బు చెల్లించి మక్కలు తీసుకెళ్లాల్సి ఉంది. లేకపోతే రోజుకు క్వింటాలుకు 4 రూపాయల జరిమానా వేస్తారు.