ఎస్‌హెచ్‌జీ మహిళలంతా ఒకే వేదికపైకి
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:41 AM
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలందరినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు మహిళా శక్తి మహాసభ కోసం పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్....
మహిళా శక్తి మహాసభకు పరేడ్ గ్రౌండ్ సిద్ధం: సీతక్క
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలందరినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు మహిళా శక్తి మహాసభ కోసం పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం సాయత్రం 4గంటలకు చేపట్టనున్న ఈ కార్యక్రమానికి 25 వేల మంది మహిళలు హాజరుకానున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల విస్తరణ, వ్యాపారాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఈ సభ ప్రతీకగా నిలవనుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తారన్నారు. అదే వేదికపై మహిళా సంఘాల రుణ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంపై సీఎం ప్రకటన చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం 553 ఆర్టీసీ బస్సులను ప్రదానం చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.