Share News

ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టినా జాప్యమెందుకు?

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:38 AM

ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద ఇప్పటికే ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్‌ ఇచ్చే విషయంలో జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పురపాలక..

ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టినా జాప్యమెందుకు?

  • నిర్దిష్ట సమయం పెట్టుకుని మొత్తం పూర్తి చేయండి.. పెండింగ్‌ దరఖాస్తుల పూర్తికి కార్యాచరణ రూపొందించండి

  • ఈ ఏడాది కూడా జూలై నెలాఖరు వరకూ ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ

  • యూడీఎస్‌ అసె్‌సమెంట్ల సమస్యను పరిష్కరించండి: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద ఇప్పటికే ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్‌ ఇచ్చే విషయంలో జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పురపాలక శాఖ అధికారులకు సూచించారు. ఇదే విషయంపై గురువారం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. నిర్దిష్ట సమయం పెట్టుకుని.. రోజువారీ ఎన్ని క్లియర్‌ చేయగలరో నిర్ణయించుకుని కార్యాలయాల వారీగా పెండింగ్‌లో ఉన్నవన్నీ పూర్తి చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వం గత ఏడాది రాయితీ ప్రకటించడంతో ఫీజు చెల్లించాలంటూ గత ఏడాది మొత్తం 21 లక్షల మందికి ఇంటిమేషన్‌ లేఖలు పంపామని, వారిలో ఏడు లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారని అధికారులు సీఎంకు వివరించారు. వారిలో ఇప్పటి వరకు 4.50 లక్షల మందికి ప్రొసీడింగ్స్‌ ఇచ్చామని, ఇంకా 2.50 లక్షల మందికి ప్రొసీడింగ్స్‌ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. దాంతో, పెండింగ్‌ దరఖాస్తులను పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం అధికారులకు నిర్దేశించినట్లు తెలిసింది. ఇదే విషయంపై ఈనెల 25న మరోసారి సమావేశమవుదామని అధికారులకు చెప్పారు. ఇక, ఈ ఏడాది కూడా జూలై నెలాఖరు వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీని అమలు చేస్తున్నందున ఫీజు చెల్లించని వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించినట్లు తెలిసింది. అలాగే, ఆస్తి పన్ను, ఖాళీ భూమి పన్ను (వీఎల్‌టీ) అంశాలపైనా సీఎం రేవంత్‌ ఆరా తీసినట్లు తెలిసింది. ఆస్తి పన్నుకు సంబంధించి.. బిల్డర్ల నుంచి ఫ్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత.. వారి పేరుతో ఉండే యూడీఎ్‌సకు అసెసెమెంట్స్‌ సకాలంలో రావడం లేదనే అంశాన్ని పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

Updated Date - Jun 19 , 2026 | 03:38 AM