Share News

కలవరపెడుతున్న నీటి గణాంకాలు

ABN , Publish Date - Oct 07 , 2026 | 06:37 AM

తెలంగాణలో నీటి వనరుల సంరక్షణ ఆందోళనకరంగా ఉంది. కేంద్ర జలశక్తి శాఖ తాజాగా వెల్లడించిన జలవనరుల గణన (సెకండ్‌ సెన్సస్‌ ఆఫ్‌ వాటర్‌బాడీస్‌) ప్రకారం.. రాష్ట్రంలో జలవనరులు గణనీయంగా కనుమరుగైనట్లు తేలింది.

కలవరపెడుతున్న నీటి గణాంకాలు
LAKE

  • రాష్ట్రంలో 8ఏళ్లలో 10,371 చెరువులు మాయం..

  • 2017-18 నాటికి 64,056 జలవనరులు

  • ప్రస్తుతం వాటి సంఖ్య 53,685కి పడిపోయింది

  • 16.2 శాతం క్షీణత.. కేంద్ర జలశక్తి శాఖ వెల్లడి

హైదరాబాద్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో నీటి వనరుల సంరక్షణ ఆందోళనకరంగా ఉంది. కేంద్ర జలశక్తి శాఖ తాజాగా వెల్లడించిన జలవనరుల గణన (సెకండ్‌ సెన్సస్‌ ఆఫ్‌ వాటర్‌బాడీస్‌) ప్రకారం.. రాష్ట్రంలో జలవనరులు గణనీయంగా కనుమరుగైనట్లు తేలింది. 2024-25లో నిర్వహించిన ఈ గణన తాలూకూ నివేదికను తాజాగా విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం.. 2017-18లో రాష్ట్రంలో 64,056 జలవనరులు ఉండగా, ప్రస్తుత లెక్కల ప్రకారం ఆ సంఖ్య 53,685కి పడిపోయింది. అంటే ఎనిమిదేళ్ల వ్యవధిలో 10,371 జలవనరులు కనుమరుగయ్యాయి. 16.2 శాతం క్షీణత. అయితే రాష్ట్రంలో చిన్న చెరువులు, కుంటలు, పెర్కొలేషన్‌ ట్యాంకులు, చెక్‌ డ్యామ్‌లు గణనీయంగా తగ్గిపోగా.. పెద్ద ట్యాంకులు, జలాశయాల సంఖ్య పెరగడం విశేషం. 2017-18లో 16,292గా ఉన్న పెద్ద ట్యాంకుల సంఖ్య, ప్రస్తుతం 17,228కి పెరిగింది. అలాగే.. జలాశయాలు తొలి సర్వే సమయంలో 111 ఉండగా ప్రస్తుతం 134 ఉన్నాయి. సరస్సులు 289 నుంచి 278కి తగ్గాయి. పెర్కొలేషన్‌ ట్యాంకులు/ చెక్‌డ్యాంలు 19239 నుంచి 11,687కి పడిపోయాయి. ఇతర జలవనరులు తొలి సర్వేలో 1122 ఉండగా రెండో సర్వేలో 176 మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో చెరువులకు చారిత్రక నేపథ్యం ఉంది. గ్రామీణ తెలంగాణలో చెరువుల వ్యవస్థ అత్యంత కీలకం. కాకతీయుల కాలం నుంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చెరువుల చుట్టూనే అభివృద్ధి చెందింది. అలాంటి చెరువుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం. 2017-18లో 27,003 చెరువులు ఉండగా తాజా గణాంకాల్లో వాటి సంఖ్య 24,182గా ఉంది. అంటే 2821 చెరువులు తగ్గాయి. సుమారు 10.4 శాతం క్షీణత. ఒక చెరువు రికార్డుల నుంచి కనుమరుగయ్యిందంటే.. దాని చుట్టూ అల్లుకుని ఉన్న ఆర్థిక,సామాజిక ప్రగతిని కూడా దెబ్బతీసే ఆస్కారం ఉంటుంది.


10,371 జలవనరులు ఏమైనట్లు..?

రాష్ట్రంలో ఎన్ని జలవనరులు ఉన్నాయనే గణాంకాలను వెల్లడిస్తున్న ప్రభుత్వం.. కనుమరుగవుతున్న జలవనరుల మీద స్పష్టమైన గణాంకాలను వెల్లడించలేని పరిస్థితి ఉంది. ఇందుకు అనేక కారణాలు చూపుతున్నారు. ఆక్రమణలు, మట్టి పేరుకుపోవడం, నీటి నిల్వ తగ్గిపోవడం, వ్యవసాయ భూములుగా మారడం, పట్టణీకరణ, రహదారుల విస్తరణ, ఇతర మౌలిక వసతుల విస్తరణలో కనుమరుగు కావడం, భూ వినియోగ మార్పులు, జలవనరుల వర్గీకరణలో మార్పు, పూర్తిగా ఎండిపోవడం, నిర్వహణ లోపంతో లెక్కలోకి తీసుకోకపోవడం వంటి కారణాలను గణాంకాల్లో పేర్కొన్నారు. ఇవన్నీ వేర్వేరుగా పరిశీలించాల్సిన అంశాలుగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో.. 10,371 జలవనరుల తగ్గుదలపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. చెక్‌ డ్యామ్‌లు, పెర్కొలేషన్‌ ట్యాంకు సంఖ్య తగ్గడం వల్ల ఆ ప్రభావం భూగర్భజలాలపై పడుతోంది. బోర్లలో నీటి లభ్యత తగ్గిపోవడం, బావుల్లో నీటి మట్టాలు పడిపోవడం వల్ల వర్షాధార వ్యవసాయంపై దీర్ఘకాలిక ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇక.. కేంద్రం నివేదికలో పేర్కొన్న 53,685 జలవనరుల్లో 53,244 జలవనరులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవి కేవలం 441 కావడం విశేషం. మొత్తం జలవనరుల్లో.. 30,973 (అంటే 58శాతం) ప్రధానంగా సాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్న జలవనరులు 136 మాత్రమే. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తున్నవి 254. ఈ నేపథ్యంలో జలవనరులు కనుమరుగైతే.. ఆ ప్రభావం పర్యావరణాన్ని మాత్రమే కాక, వ్యవసాయం, రైతుల ఆదాయం, భూగర్భజలాలు, గ్రామీణ ఉపాధి వంటి అంశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాగా.. రాష్ట్రంలో 6740 ప్రైవేటు జలవనరులు ఉన్నట్లు గణాంకాల్లో వెల్లడించారు. వీటిలో 5122 వ్యక్తిగత యాజమాన్యంలో ఉన్నాయి.


ఐదేళ్లలో పునరుద్ధరించినవి.. 367

జలవనరులను సంరక్షించే క్రమంలో గత ఐదేళ్లలో ప్రభుత్వం పునరుద్ధరణ చేసిన జలవనరులు 367. ఇందులో ట్యాంకులు 192, చెరువులు 115, చెక్‌డ్యామ్‌లు/పెర్కొలేషన్‌/ ఇతర జలవనరులు 55, సరస్సులు 3, జలాశయాలు 2 ఉన్నాయి. తగ్గుతున్న జలవనరులపై ప్రభుత్వం సేకరించే లెక్కలను కేవలం గణాంకాల కోణంలో చూడకుండా.. వాటర్‌ బాడీ హెల్త్‌కార్డుగా పరిగణించి.. ప్రత్యేక ఆడిట్‌ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే.. ప్రతి చెరువునూ జీఐఎస్‌ మ్యాపింగ్‌ ద్వారా సంరక్షించాలని నివేదికలో సూచించారు. చెరువు విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్‌, నీటి ప్రవాహ మార్గాలు, క్యాచ్‌మెంట్‌, ఆయకట్టు, ఆక్రమణలు అన్నింటిని జీఐఎ్‌సలో నమోదు చేయాలని, ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని పేర్కొన్నారు

Updated Date - Oct 07 , 2026 | 06:39 AM