లిక్కర్ కంపెనీలకు త్రిసభ్య కమిటీ షాక్!
ABN , Publish Date - May 21 , 2026 | 03:10 AM
రాష్ట్రంలో మద్యం ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో.. నిబంధనలు కఠినతరం చేస్తూ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య ధరల నిర్ధారణ కమిటీ రంగంలోకి దిగింది.
ప్రతి పైసా లెక్క చెప్పాల్సిందే..
ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేముందు ఆధారాలడిగిన ప్రభుత్వం
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో.. నిబంధనలు కఠినతరం చేస్తూ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య ధరల నిర్ధారణ కమిటీ రంగంలోకి దిగింది. మద్యం ధరల సవరణ కోసం ఒత్తిడి తెస్తున్న లిక్కర్ కంపెనీల ఉత్పత్తి వ్యయంపై కమిటీ నిఘాపెట్టింది. ముడిసరుకుల వ్యయం, రవాణా ఛార్జీలు పెరిగాయంటూ కంపెనీలు చేస్తున్న వాదనల్లో నిజమెంతో తేల్చేందుకు.. అత్యంత కీలకమైన అంతర్గత ఆర్థిక రికార్డులను సమర్పించాల్సిందిగా తయారీదారులు, సప్లయర్లను డిమాండ్ చేసింది. ఈ నెల 28లోపు పూర్తి సమాచారం ఇవ్వాలని మంగళవారం ఆదేశాలివ్వడంతో కంపెనీల్లో ఆందోళన మొదలైంది. తమ రహస్య అంతర్గత అకౌంట్ వివరాలను ఇచ్చేందుకు మద్యం తయారీదారులు, సప్లయర్లు ససేమిరా అంటున్నారు. దీనిపై మంగళవారం వారంతా అత్యవసరంగా సమావేశమై.. కమిటీ తెచ్చిన కొత్త నిబంధనలను ఎలా తిప్పికొట్టాలా అని చర్చించినట్లు తెలిసింది.
కరెంటు బిల్లుల నుంచి ఈఎస్ఐ దాకా.. మూడేళ్ల రికార్డులపై నజర్
కంపెనీల ప్లాంట్ల వివరాలు, ఆర్థిక లావాదేవీలు, ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కమిటీ ప్రధానంగా 10 రకాలైన కీలక నివేదికలను డిమాండ్ చేసింది. సప్లయర్స్/డిస్టిలరీలకు సంబంధించిన అధికారిక రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్లాంట్ల సంఖ్య, వాటి స్థాపిత సామర్థ్యం, ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తి పరిణామాల వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. ముఖ్యంగా లిక్కర్ తయారీలో వాడే ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్‌ఏ) ధరల సపోర్టింగ్ పత్రాలు, గత మూడేళ్ల ముడిసరుకు కొనుగోలు ఇన్‌వాయి్‌సలు, గ్లాస్ బాటిళ్లు, లేబుల్స్‌తో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఖర్చులనూ జీఎస్టీ బ్రేక్-అ్‌పతో సహా సమర్పించాలని ఆదేశించింది. ప్లాంట్ల అంతర్గత నిర్వహణ ఖర్చులైన బ్లెండింగ్ ఛార్జీలు, కరెంట్ బిల్లులు, నీటి బిల్లుల వంటి వాటిని కూడా కమిటీ లెక్కగట్టనుంది. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పరీక్షించేందుకు గత మూడు ఆర్థిక సంవత్సరాల ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లతో పాటు ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక ఫైనాన్షియల్స్, కాస్ట్, టాక్స్ ఆడిట్ రిపోర్టులను సేకరిస్తోంది. గత ఆరు నెలలకు సంబంధించి బ్రాండ్ వారీ సర్టిఫైడ్ కాస్ట్ కార్డ్, మూడేళ్ల వార్షిక కాస్ట్ షీట్లను నివేదికలో చేర్చాలని ఆదేశించింది. కంపెనీలు ఇచ్చే ఈ సమాచారాన్ని క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాతే ఏ బ్రాండ్‌పై ఎంత పెంచాలనే దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని స్పష్టం చేసింది.