ఏపీని మించి రేట్లు పెంచొద్దు..!!
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:40 AM
రాష్ట్రంలో మద్యం ధరలు పెంపుపై కసరత్తు జరుగుతోంది. మద్యం ధరలను 10 నుంచి 15 శాతం వరకు పెంచాలని తయారీదారులు కోరుతున్నారు.
రాష్ట్రంలో మద్యం ధరల పెంపుపై మథనం
10 నుంచి 15 శాతం ధరలు పెంచాలంటున్న తయారీదారులు
ఆంధ్రలోని ధరలకు మించి పెంపు వద్దంటున్న సరఫరాదారులు
ప్రైస్ రివిజన్ కమిటీకి ఇరువర్గాల ప్రతిపాదనలు
హైదరాబాద్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం ధరలు పెంపుపై కసరత్తు జరుగుతోంది. మద్యం ధరలను 10 నుంచి 15 శాతం వరకు పెంచాలని తయారీదారులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మద్యం ధరలను మించకుండా ధరల పెంపు చేపట్టాలని మద్యం సరఫరాదారులు అంటున్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన సమావేశంలో ప్రైస్ రివిజన్ కమిటీ ముందు ఇరువర్గాలు తమ ప్రతిపాదనలు ఉంచాయి. సీఐఏబీసీ( కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కాహాలిక్ బేవరేజ్ కంపెనీ), ఐఎ్‌సడబ్ల్యూఏఐ(ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా), బీఏఐ(బ్రెవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా), అసోసియేషన్ ఆఫ్ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. పెరిగిన ముడి సరుకు ధరలు, గ్యాస్ కొరత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని మద్యం ధరలను పెంచాలని తయారీ సంస్థలు ఈ సమావేశంలో ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనపై అసోసియేషన్ ఆఫ్ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్ సంఘం అభ్యంతరం తెలిపింది. ఏపీలో ఉన్న మద్యం ధరలతో సమానంగా పెంపు ఉండాలని సూచన చేసింది. అంతకుమించి ధరలు పెంచితే ఎన్‌డీపీఎల్(నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్) రాష్ట్రంలోకి ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుందని పేర్కొంది. తెలంగాణలో ప్రస్తుతం ఏపీ కంటే రూ.10 తక్కువకే మద్యం దొరుకుతుందని.. ఒక వేళ ధరలు పెంచితే ఏపీలో ఉన్న ధరలతో సమానంగా మాత్రమే పెంచాలని తమ సంఘం ప్రతిపాదించిందని అసోసియేషన్ ఆఫ్ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్ అధ్యక్షుడు కామేశ్వరరావు తెలిపారు.
బీర్ల ధర తగ్గించిన కర్ణాటక
తెలంగాణలో మద్యం ధరలు పెంచాలని తయారీ సంస్థలు ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో.. ఎక్సైజ్ వర్గాల్లో కర్ణాటక అంశంపై చర్చ జరుగుతోంది. బీరు, ప్రీమియం లిక్కర్ ధరలను ఇటీవల తగ్గించిన కర్ణాటక.. చీప్ లిక్కర్ ధరలను మాత్రం పెంచింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీరు, ప్రీమియం లిక్కర్ ధరలు పెంచితే కర్ణాటక నుంచి ఎన్‌డీపీఎల్ రాష్ట్రంలోకి వచ్చే ముప్పు ఉందని ఎక్సైజ్ వర్గాలు అంటున్నాయి. కర్ణాటకలో బీర్ ధరలు రూ.100 నుంచి రూ.110 లోపు ఉండగా.. రాష్ట్రంలో మాత్రం బీర్ ప్రస్తుతం రూ.170 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మద్యం ధరల అంశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.