మద్యం ధరలకు రెక్కలు!
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:17 AM
రాష్ట్రంలోని మద్యం ప్రియులకు చేదువార్త. మద్యం, బీర్ల ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముడి సరుకుల ధరల పెరుగుదల, రవాణా భారం...
వచ్చే నెలలో భారీగా పెరిగే అవకాశం
పెంచకపోతే సరఫరా నిలిపేస్తామంటూ.. ప్రభుత్వానికి మద్యం కంపెనీల అల్టిమేటం
మద్యంతోపాటు బీర్ల ధరలనూ పెంచుకునేందుకు కంపెనీల కుట్ర!
ఎక్సైజ్ శాఖపై ఒత్తిడి..ప్రతిపాదనలపై కసరత్తు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మద్యం ప్రియులకు చేదువార్త. మద్యం, బీర్ల ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముడి సరుకుల ధరల పెరుగుదల, రవాణా భారం, ఇరాన్-అమెరికా యుద్ధ పరిణామాలతో తాము కుదేలవుతున్నామని, ధరలు పెంచకపోతే సరఫరా నిలిపివేస్తామని మద్యం తయారీ కంపెనీలు ఎక్సైజ్ శాఖకు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలోనే మద్యం ధరలు తక్కువగా ఉన్నాయని, తమకు మిగిలే లాభం నామమాత్రమేనని పేర్కొన్నాయి. ఒకవేళ సరఫరా నిలిపివేయాల్సి వస్తే.. తొలుత తెలంగాణకే నిలిపివేస్తామని కుండబద్దలు కొట్టాయి. ఈ వారం లోగా పెంపుపై స్పష్టమైన హామీ రాకపోతే.. నేరుగా ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి తమ అభిప్రాయం తెలిపాలని కంపెనీలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ పరిణామాలను చూస్తుంటే.. వచ్చే నెలలో మద్యం, బీర్ల ధరలు భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిర్ణీత గడువు ముగిసినందున మద్యం ధరలు పెంచడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. యుద్ధం, బీర్ల కొరతను సాకుగా చూపుతూ పనిలో పనిగా బీర్ల ధరలు కూడా పెంచుకోవడానికి ఉత్పత్త్తిదారులు కుట్ర పన్నుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతేడాది బీర్ల ధరలు పెంచినా..
సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకోసారి మద్యం ధరలను సవరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 2025 ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచినప్పటికీ.. సాధారణ మద్యం ధరల పెంపు మాత్రం పెండింగ్‌లో ఉంది. అంతకుముందు 2023 మే నెలలో ధరలు పెంచగా, నిబంధనల ప్రకారం 2025 మే నాటికి మళ్లీ పెంచాల్సి ఉంది. అయితే.. స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అప్పట్లో జరిగిన జాప్యాన్ని కంపెనీలు ఇప్పుడు సాకుగా చూపుతున్నాయి. అంతేకాకుండా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత వేసవిలో బీర్లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో సరఫరా నిలిపివేస్తామని అల్టిమేటం జారీ చేశాయి. దీని వెనుక మద్యం, బీర్ల ధరలను ఏకకాలంలో పెంచుకునే కుట్ర ఉందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి లిక్కర్ ధరలను పెంచడానికి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రిటైర్డ్ జడ్జితో కూడిన జ్యుడీషియల్ కమిటీ.. ధరల పెంపు అంశాన్ని లోతుగా పరిశీలిస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో ధరల పెంపు ఏ మేరకు ఉందనే సమాచారాన్ని తెప్పించుకుని చర్చిస్తోంది. దాదాపు మే నెలలో మద్యం ధర పెంపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఇదే సమయంలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా సహజ వాయువు (నేచురల్ గ్యాస్) సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో మద్యం నింపే ఖాళీ సీసాల (గ్లాస్ బాటిల్స్) ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని డిస్టిలరీల యజమానులు అంటున్నారు. ఈ అదనపు భారాన్ని తాము భరించలేకపోతున్నామని, వెంటనే మద్యం ధరలు పెంచాలని ఎక్సైజ్ అధికారులను కోరుతున్నారు.
రెండేళ్ల గడువు పూర్తికాకుండానే..
గత ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం బీర్ల ధరలను 15 శాతం పెంచినప్పటికీ.. ప్రస్తుతం సీసాల కొరత, అల్యూమినియం క్యాన్ల రేట్లు పెరగడంతో మరోసారి ధరల పెంపు తప్పనిసరి అని కంపెనీలు వాదిస్తున్నాయి. వేసవిలో బీర్లకు డిమాండ్ 30శాతం వరకు పెరుగుతుండటంతో సరఫరా తగ్గడం మార్కెట్‌లో కొంతమేరకు కొరతకు దారితీస్తోంది. ఇదే అనువుగా భావించిన కంపెనీలు.. బీరు ధరల అంశాన్ని కూడా తెరపైకి తెచ్చాయి. అయితే మద్యం కంపెనీలు బలవంతంగా బీర్ల ధరలు పెంచుకోవడానికే సరఫరా నిలిపివేస్తామంటున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 2027 ఫిబ్రవరిలో ధరలు పెంచాల్సి ఉంది. కానీ, తొమ్మిది నెలల ముందే బీర్ల ధరను పెంచుకోవడానికి తయారీ కంపెనీలు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయి.