లైఫ్ సైన్సెస్.. సామాజిక బాధ్యత
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:26 AM
లైఫ్ సైన్సెస్ రంగాన్ని తమ ప్రభుత్వం కేవలం వ్యాపారంగా మాత్రమే చూడటం లేదని, సామాజిక బాధ్యతగా చూస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యసాధనలో కీలకం
రాష్ట్రంలో 2వేలకు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు
జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో మూడో వంతు..ఎగుమతుల్లో ఐదో వంతు తెలంగాణదే
సదస్సుకు 4,394 మంది ప్రతినిధుల హాజరు
పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి
బయో ఆసియా-2026 సదస్సు ముగింపు వేడుకలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): లైఫ్ సైన్సెస్ రంగాన్ని తమ ప్రభుత్వం కేవలం వ్యాపారంగా మాత్రమే చూడటం లేదని, సామాజిక బాధ్యతగా చూస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్‌హౌ్‌సగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కేవలం రెండేళ్లలోనే రూ.73,360 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, లక్ష ఉద్యోగాలు సృష్టించామన్నారు. హైటెక్స్‌లో రెండు రోజుల బయో ఆసియా-2026 సదస్సులో భాగంగా బుధవారం ‘తెలంగాణ రైజింగ్-2047: బిల్డింగ్ ఎ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం’ పేరిట నిర్వహించిన ఫైర్‌సైడ్ చాట్, ముగింపు వేడుకలో మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతోనే ప్రజలు, నిపుణుల భాగస్వామ్యంతో తెలంగాణ రైజింగ్-2047కు శ్రీకారం చుట్టామన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యసాధనలో కీలకపాత్ర పోషించేలా లైఫ్ సైన్సెస్ రంగం ఎకో సిస్టమ్‌ను మరింత బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే.. తెలంగాణ నెక్స్ట్‌జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ (2026-2030), తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్, 1బయో ఇంక్యుబేటర్, జీనోమ్ వ్యాలీ విస్తరణ, ఫార్మా విలేజెస్, తెలంగాణ లైఫ్ సైన్సె్‌సను మరింత బలోపేతం చేసేందుకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీకి శ్రీకారం చుట్టామని వివరించారు.
2వేలకు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థల కార్యకలాపాలు..
రాష్ట్రంలో ప్రస్తుతం 2వేలకు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో మూడో వంతు, ఎగుమతుల్లో ఐదో వంతు వాటా తెలంగాణదే కావడం గర్వకారణమన్నారు. ఈ ఏడాది సదస్సులో సనోఫీ, ఒపెల్లా, వ్యాక్సిండో యానిమల్ హెల్త్, ట్రెడెన్స్, ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు ముందుకొచ్చాయని వెల్లడించారు. బయో ఎకానమీ రంగంలో మూడో అతిపెద్ద శక్తిగా ఎదగడానికి భారత్‌కు ఉన్న అవకాశాలు, తెలంగాణ పాత్రపై చర్చించి.. ప్రత్యేక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌తో కలిసి ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈసారి ఫార్చ్యూన్ 500 కంపెనీల ప్రతినిధులతోపాటు దేశ విదేశాల నుంచి మొత్తం 4,394 మంది ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాల కోసం 4వేలకు పైగా అత్యున్నత స్థాయి బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) సమావేశాలకు ఈ ఏడాది సదస్సు వేదికగా నిలిచిందన్నారు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ శిఖరాగ్ర సదస్సుకు శ్రీధర్‌బాబు
ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026’ లో మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నారు. ఈ సదస్సు ఈ నెల 16న ప్రారంభం కాగా, గురు, శుక్రవారాల్లో నిర్వహించే పలు సమావేశాల్లో శ్రీధర్‌బాబు పొల్లొని కీలకోపన్యాసం చేయనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ిసీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ సభ్యులు, దిగ్గజ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులు, బ్యాంకింగ్ రంగాలకు చెందిన పలువురు ముఖ్యులతో శ్రీధర్‌బాబు భేటీ అవుతారు. స్వీడన్ వాణిజ్య బృందంతో భేటీ అవుతారు.