Share News

ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లలో..మనమే నం.1

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:36 AM

ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ యాసంగి సీజన్‌లో ..

ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లలో..మనమే నం.1

  • యాసంగిలో 64 లక్షల టన్నులు కొన్నాం

  • రైతులకు 11,500 కోట్ల చెల్లింపులు పూర్తి

  • కేంద్రం సేకరిస్తున్న ధాన్యంలో 63శాతం రాష్ట్రం నుంచే: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  • కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని ప్రకటన

తిరుమలగిరి/హుజూర్‌నగర్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ యాసంగి సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో తెలంగాణ నుంచే 63 శాతం ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 64 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతులకు రూ.11,500 కోట్లు చెల్లించినట్లు వివరించారు. సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. తరుగు తీసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ను మంత్రి ఆదేశించారు. అనంతరం తిరుమలగిరి తహసీల్దార్‌ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో ఈ నెల నాలుగో తేదీలోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. యాసంగిలో 64 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 నుంచి 72 గంటల్లోనే డబ్బులు రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు.

త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు

రాష్ట్రంలోని అర్హులందరికీ త్వరలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని ఉత్తమ్‌ తెలిపారు. హుజూర్‌నగర్‌లో నిర్మిస్తున్న మోడల్‌ కాలనీ ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ కార్డులు అందజేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తూ ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతోందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - Jun 02 , 2026 | 04:36 AM