Share News

ప్రకృతి వ్యవసాయంలో దేశానికే తెలంగాణ ఆదర్శం కావాలి

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:42 AM

ప్రకృతి వ్యవసాయంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ప్రకృతి వ్యవసాయంలో దేశానికే తెలంగాణ ఆదర్శం కావాలి

  • 61,125 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగుకు ప్రణాళిక

  • 22న రైతు భరోసా నిధుల విడుదల: తుమ్మల

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా సచివాలయంలో మంగళవారం రైతులకు కిట్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. అటుపై ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్త రైతు వేదికల ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో మంత్రి తుమ్మల నేరుగా ముచ్చటిస్తూ వారి అనుభవాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంభించాలని రైతులకు సూచించారు. ఈ ఏడాది రూ.42 కోట్లతో 489 క్లస్టర్లలో 61,125 ఎకరాల్లో ఈ పథకం అమలుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన చెప్పారు. ఇందుకోసం ఎంపిక చేసిన 61,125 మంది రైతులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. పంటల సాగు, మార్కెటింగ్‌కు తోడ్పాటునిచ్చేందుకు ఒక్కో క్లస్టర్‌లో పని చేసే ఇద్దరు కృషి సఖిలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే బీజామృతం, జీవామృతం, దశపర్ణి వంటి జీవ ఉత్పాదకాల తయారీ కేంద్రాల ఏర్పాటుకు రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 20 నుంచి నర్మెట్టలో రైతు మహోత్సవం ప్రారంభిస్తున్నట్లు తుమ్మల చెప్పారు. ఈ ఉత్సవంలో రైతుల కోసం వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన 150 ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 22 సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా నర్మెట్టలో తొలి విడుత రైతు భరోసా నిధులను విడుదల చేస్తామన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 05:42 AM