Share News

Telangana Leads in Laptop Usage: తెలంగాణ ల్యాప్‌‘టాప్‌’!

ABN , Publish Date - Jan 07 , 2026 | 03:36 AM

టెక్నాలజీకి కేంద్రబిందువుగా నిలుస్తున్న తెలంగాణ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. దేశంలోనే అత్యధికంగా పట్టణ గృహాల్లో ల్యాప్‌టా్‌పలు ఉన్న రాష్ట్రంగా నిలిచింది.

Telangana Leads in Laptop Usage: తెలంగాణ ల్యాప్‌‘టాప్‌’!

  • పట్టణ గృహాల్లో దేశంలోనే అత్యధికం.. డ్యూరబుల్‌ గూడ్స్‌లోనూ రెండో స్థానం

  • వీటిపై ప్రజల సగటు ఖర్చు రూ.1,022లు

  • రూ.1,191లతో మొదటి స్థానంలో మహారాష్ట్ర

  • క్రమేపీ టీవీ చానళ్లకు తగ్గుతున్న ఆదరణ

  • మెరుగైన కనెక్టివిటీ, డేటా చౌకే కారణం

  • ఆర్థిక సలహా మండలి నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): టెక్నాలజీకి కేంద్రబిందువుగా నిలుస్తున్న తెలంగాణ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. దేశంలోనే అత్యధికంగా పట్టణ గృహాల్లో ల్యాప్‌టా్‌పలు ఉన్న రాష్ట్రంగా నిలిచింది. గత దశాబ్దంలో కేవలం 10 శాతంగా ఉన్న ల్యాప్‌టా్‌పల వినియోగం, ప్రస్తుతం 19 శాతానికి చేరింది. దీన్ని విద్య, ఐటీ, డిజిటల్‌ వర్క్‌ కల్చర్‌ విస్తరణకు నిదర్శనంగా నిపుణులు చెబుతున్నారు. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన ‘చేంజెస్‌ ఇన్‌ డ్యూరబుల్‌ గూడ్స్‌ ఓనర్షిప్‌ ఇన్‌ ఇండియా’ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో డ్యూరబుల్‌ గూడ్స్‌పై (దీర్ఘకాలిక వినియోగ వస్తువులు) వార్షిక ఖర్చులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దీర్ఘకాలిక వస్తువుల్లో కార్లు, గృహోపకరణాలు, ఫర్నిచర్‌ వంటి వస్తువులు ఉంటాయి. ఇందులో 63 శాతం పట్టణ కుటుంబాలకు మోటార్‌ వాహనాలు ఉండగా, 58 శాతం కుటుంబాల్లో ఫ్రిజ్‌లు, 45 శాతం కుటుంబాల్లో ఎయిర్‌ కూలర్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అయితే వాషింగ్‌ మెషిన్‌ వినియోగం మాత్రం 33 శాతానికే పరిమితమైంది. స్వల్పకాలిక వస్తువులు అంటే మూడేళ్లలోపే వినియోగించే లేదా ఒక్కసారి ఉపయోగించేందుకు ఉద్దేశించిన వస్తువులు. ఈ వర్గంలో ఆహారం, శుభ్రపరిచే సామగ్రి, దుస్తులు వంటి వస్తువులుంటాయి.


ఉత్పాదకత, జీవన ప్రమాణాల మెరుగుదలకు అద్దం

పేద, మధ్య తరగతి, ధనిక వర్గాల ఖర్చుల మధ్య గణనీయమైన వైవిధ్యం కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చుల సరళిని పరిశీలిస్తే.. పట్టణ ప్రాంత నివాసితులు సగటున రూ.1,022లను దీర్ఘకాలిక వినియోగ వస్తువులపై ఖర్చు చేస్తున్నారని తెలిపింది. ఇది ఈ రంగంలో రాష్ట్ర ప్రాముఖ్యతను చాటుతోంది. ఈ మేరకు దేశంలోనే, తెలంగాణ రెండో అతిపెద్ద వినియోగ రాష్ట్రంగా నిలిచిందని నివేదిక పేర్కొంది. మహారాష్ట్ర మాత్రమే ముందుండి, అక్కడ ఒక్కొక్కరి సగటు ఖర్చు రూ.1,191 గా నమోదైనట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ మార్పులు వ్యక్తిగత ఉత్పాదకత, జీవన ప్రమాణాల మెరుగుదలకు అద్దం పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో 2011-12 నుంచి 2023-24 మధ్యకాలంలో ల్యాప్‌టా్‌పల వినియోగం 9 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. కర్ణాటక వంటి టెక్‌ హబ్‌ రాష్ట్రాల్లో ఈ వృద్ధి 2 నుంచి 3 శాతంగానే ఉందని, ఆ రాష్ట్రాలంలో పోలిస్తే తెలంగాణ వృద్ధి అధికమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ల్యాప్‌టాప్‌ వినియోగం ఇంకా కొన్ని వర్గాలకేపరిమితమై ఉందని, ప్రత్యేక నైపుణ్యాలు, విద్యావసరాలే ఈ పరిమితికి కారణమని నివేదిక స్పష్టం చేసింది. ఇదే సమయంలో మొబైల్‌ ఫోన్ల వినియోగం పట్టణ, గ్రామీణ తేడా లేకుండా దాదాపు అన్ని చోట్లకు చేరింది. మెరుగైన కనెక్టివిటీ, డేటా చౌకగా లభించడం వల్ల మొబైల్‌ ఫోన్‌ ప్రతి ఇంటో నిత్యావసర వస్తువుగా మారింది. ఈ మార్పుతో టెలివిజన్‌ ప్రాధాన్యం క్రమంగా తగ్గుతోంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం, పట్టణ ప్రాంతాల్లో 80 శాతం కుటుంబాల్లో టీవీలున్నప్పటికీ, సమాచార, వినోద అవసరాలకు మొబైల్‌ ఫోన్లు ప్రధాన సాధనంగా మారుతున్నాయని నివేదిక విశ్లేషించింది. ఏదో ఒక ఓటీటీ, యూట్యూబ్‌లో ఇలా కొట్టగానే.. అలా సినిమాలు దర్శనమిస్తున్నాయి. అందుకే నేడు ఎంటర్‌టైన్‌మెంట్‌ చానళ్లకు ఆదరణ తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు. దానికి తోడు టీవీల్లో చూస్తే మధ్య మధ్యలో వచ్చే యాడ్స్‌తో విసుగు చెంది, తమకిష్టమున్న క్లిప్‌ను, ఇష్టమొచ్చిన విధంగా మొబైల్స్‌లో చూడడానికి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టపడుతున్నారు. దీంతో నిర్వహణ భారాన్ని భరించలేక, కొన్ని వినోద చానళ్లు మూసివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 07 , 2026 | 08:31 AM