Share News

తెలంగాణ భేష్‌

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:26 AM

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక స్థిరత్వం అంత బలంగా లేదని, తెలంగాణలో పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ.....

తెలంగాణ భేష్‌

  • ఆర్థిక ఆరోగ్య సూచీలో అగ్ర స్థానం

  • పన్ను వసూళ్లు, ఆదాయ సామర్థ్యం, ఆర్థిక పునాది బలంగా ఉండటమే కారణం

  • ఆర్థిక స్థిరత్వంలో ఏపీ కంటే మెరుగు

  • సూచీలో ఏపీ 29.6, తెలంగాణ 61.9

  • మూడేళ్లుగా తగ్గుతున్న అప్పుల భారం

  • ఏపీ, తెలంగాణల్లో రెవెన్యూ వసూళ్ల కంటే హామీల భారమే ఎక్కువ

  • ఎన్‌ఐపీఎఫ్‌పీ-ప్రపంచ బ్యాంకు నివేదిక

న్యూఢిల్లీ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక స్థిరత్వం అంత బలంగా లేదని, తెలంగాణలో పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) - ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. బడ్జెట్‌తో నిమిత్తం లే కుండా తెలంగాణలో అధికంగా అప్పులు చేశారని, అయితే, గత మూడేళ్లుగా ఈ అప్పులు తగ్గిపోతున్నాయని స్పష్టం చేసింది. ఇది మంచి పరిణామమని పేర్కొంది. తెలంగాణకు రుణాలు, హామీలు, ఇతర భారాలు ఆందోళనకరంగా ఉన్నా.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దానికి బలమైన ఆర్థిక సామర్థ్యం ఉందని పేర్కొంది. ప్రపంచ బ్యాంకుతో కలిసి గత ఏడాది అక్టోబరులో జరిపిన 3వ రాష్ట్రాల ఫోరమ్‌ చర్చల ఆధారంగా ఎన్‌ఐపీఎఫ్‌పీ తాజా నివేదికను విడుదల చేసింది. రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా, అభివృద్ధి దృక్పథంతో, ఆర్థికంగా స్థిరత్వంతో ఉంటేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలమని స్పష్టం చేసింది. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధ్యం కావాలంటే కొన్ని సమస్యలను పరిష్కరించాలని సూచించింది. వివిధ రాష్ట్రాలలో పెరిగిపోతున్న వ్యయాలు, అత్యధిక రుణ భారం, కేంద్రం చెల్లింపులు సన్నగిల్లడం, జీఎస్టీ సంబంధిత ఆదాయ అస్థిరతలు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాలు, ప్రజా సేవల కోసం పెరుగుతున్న డిమాండ్లను ఆ జాబితాలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగా తెలంగాణను తీవ్ర ఒత్తిడి కలిగిన రాష్ట్రాల క్యాటగిరీలో చేర్చలేమని, అయితే, రుణానికి సంబంధించిన ముప్పులు తెలంగాణకు కూడా తీవ్రంగా ఉన్నాయని వివరించింది. ఆర్థిక స్థిరత్వం ఏపీ కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, బలంగా లేదని స్పష్టం చేసింది. ఏపీలో ఆర్థిక స్థిరత్వ సూచిక 29.6 కాగా తెలంగాణలో ఇది 61.9 అని తెలిపింది. తద్వారా, తెలంగాణను దిగువన ఉన్న రాష్ట్రాల జాబితాలో కాకుండా మధ్యశ్రేణి రాష్ట్రాల్లో చేర్చవచ్చని పేర్కొంది. ‘‘తెలంగాణలో కూడా రెవెన్యూ వసూళ్ల కంటే హామీల భారం అధికం. జీఎ్‌సడీపీలో ఇది 15 శాతం మేరకు ఉంటుంది. తెలంగాణ ఆర్థిక లోటు జీఎ్‌సడీపీలో 3.4 శాతం.


ఏపీలో ఉన్న 4.68 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. ఏపీతో పోలిస్తే తెలంగాణకు ఆర్థిక సౌలభ్యం ఎక్కువే. ఖర్చును భరించేందుకు అప్పులు చేయాల్సిన అవసరం లేదు’’ అని తెలిపింది. అయినా, తెలంగాణలో కూడా మొత్తం వ్యయంలో రెవెన్యూ ఖర్చు 86 శాతం ఉందని, ఫలితంగా, మూలధన పెట్టుబడులకు వెసులుబాటు తక్కువేనని విశ్లేషించింది. తెలంగాణలో సామాజిక దృక్పథంతో బడ్జెట్‌ వ్యూహాలను రూపొందిస్తున్నారని, మౌలిక సదుపాయాల ఆధారిత అభివృద్ధి వ్యూహాలపై కాకుండా సంక్షేమం, ఆరోగ్యం, విద్య, సామాజికాభివృద్ధిపై దృష్టి సారించారని నివేదిక పేర్కొంది. రెవెన్యూ సమీకరణ, ఆరోగ్యకరమైన ఆర్థిక చర్యల మూలంగా తెలంగాణ స్థూలంగా ఆర్థిక ఆరోగ్య సూచికలో అగ్ర స్థానంలో చేరిందని తెలిపింది. ఇందుకు బలమైన పన్ను వసూళ్లు, ఆదాయాన్ని సేకరించగలిగిన మెరుగైన సామర్థ్యం, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆర్థిక పునాది బలంగా ఉండడం కారణమని విశ్లేషించింది. ఇక, రుణ భారాన్ని నిర్వహిస్తూనే సంక్షేమ పథకాల హామీలను అమలు చేయడం, మూలధన పెట్టుబడులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం ఏపీకి అతి పెద్ద సవాలుగా ఈ నివేదిక అభివర్ణించింది. ఇచ్చిన హామీలు, రుణాలను తిరిగి చెల్లించగలిగిన సామర్థ్యం, స్థిరమైన వ్యయం అనేవి ఏపీకి సంబంధించిన మధ్యకాలిక ఆర్థిక సమస్యలని తెలిపింది. ఏపీకి వచ్చే రెవెన్యూ వసూళ్ల కంటే ప్రకటించిన హామీల మొత్తం ఎంతో ఎక్కువని, దాంతో, బ్యాలెన్స్‌ షీట్‌ గతి తప్పే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. జీతాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు, సంక్షేమ పథకాలు, సబ్సిడీల వంటి రెవెన్యూ వ్యయం మొత్తం ఖర్చులో 86 శాతం మేరకు ఉంటుందని, దీనివల్ల మూలధన పెట్టుబడులకు పరిమితంగా అవకాశం ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

Updated Date - Jun 21 , 2026 | 05:26 AM