Share News

కులగణనపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

ABN , Publish Date - May 21 , 2026 | 03:37 AM

జనగణనలో భాగంగా కులగణన నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు.

కులగణనపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

  • టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌

  • సామాజిక న్యాయానికి బలం చేకూర్చే తీర్పు: మంత్రి పొన్నం

  • ఈ తీర్పు చరిత్రాత్మకం: ఆర్‌. కృష్ణయ్య

హైదరాబాద్‌, రాంనగర్‌, మే 20(ఆంధ్రజ్యోతి): జనగణనలో భాగంగా కులగణన నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. దేశంలోని సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కుల గణన అత్యంత అవసరమని కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటినుంచో చెబుతోందని అన్నారు. వెనుకబడిన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే సమగ్ర కులగణన తప్పనిసరి అని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం సామాజిక న్యాయానికి బలాన్ని చేకూర్చే అంశమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బిల్లు.. ప్రస్తుతం రాష్ట్రపతి పరిశీలనలో ఉందని, దాన్ని వెంటనే ఆమోదించాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. సుప్రీంకోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తంచేస్తూ ప్రభుత్వ సలహాదారు వి. హన్మంతరావు నేతృత్వంలో కాంగ్రెస్‌ శ్రేణులు గాంధీభవన్‌లో బుధవారం సంబురాలు చేసుకున్నాయి. కాగా. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని, కేంద్ర ప్రభుత్వానికి పెద్ద విజయమని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ సమాజం కులం ఆధారంగా నిర్మితమైందని, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటే కులాలవారీగా వివరాలు అవసరమని అన్నారు. సుప్రీంకోర్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన పరిణామం అని తెలంగాణ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు.

Updated Date - May 21 , 2026 | 03:37 AM