హరీశ్ పెద్ద యోధుడిలా ఫీల్ అవుతున్నారు
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:15 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే ఏదో పెద్ద పోరాట యోధునిలాగా హరీశ్ రావు ఫీల్ అవుతున్నారని, పదేళ్ల పాటు నీచాతి నీచంగా ఫోన్లు ట్యాపింగ్ చేయించి ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ధ్వజమెత్తారు.
సిట్ దెబ్బకు చిన్న మెదడు చితికింది: అయిలయ్య, శ్రీనివాస్
విచారణలో వాస్తవాలు చెప్పండి: చనగాని దయాకర్
హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే ఏదో పెద్ద పోరాట యోధునిలాగా హరీశ్ రావు ఫీల్ అవుతున్నారని, పదేళ్ల పాటు నీచాతి నీచంగా ఫోన్లు ట్యాపింగ్ చేయించి ఇప్పుడు సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ధ్వజమెత్తారు. ఇంటి అల్లుడి ఫోన్‌నే ట్యాప్ చేశారంటూ స్వయంగా కవితనే చెప్పారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల ముందు డ్రామా చేస్తున్నారన్న హరీశ్ రావు వ్యాఖ్యలపైన స్పందిస్తూ.. ఈ కేసు కొత్తది కాదని, గత రెండేళ్లుగా విచారణ జరుగుతుందని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపైన నోరు పారేసుకుంటే నాలుక కోస్తామని మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. సిట్ దెబ్బకు హరీశ్ రావు చిన్న మెదడు చితికినట్లుగా ఉందని, విచారణ అనంతరం తిక్కతిక్కగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సిట్ అధికారుల ప్రశ్నలకు నీళ్లు నమిలిన ఆయన.. బయటికి వచ్చాక బడాయి కబుర్లు చెబుతున్నారన్నారు. తానేమైనా హోం మంత్రినా.. ట్యాపింగ్‌కు, తనకు ఏంటి సంబంధమంటూ హరీశ్ రావు మాట్లాడుతున్నాడని, అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన చెప్పకనే చెబుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావును విచారణకు పిలిస్తే తెలంగాణ జాతి పితలాగా హడావుడి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. ఆయన్ను విచారించవద్దని చట్టంలో ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌ను విచారణకు పిలిస్తే సంబరాలు చేసుకుంటున్నారని, తప్పు చేశామన్న భావన వారికి ఏమాత్రం లేకపోవడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. ఇంకా మాట్లాడేందుకు కొంచెమైనా సిగ్గుండాలన్నారు. ఇంట్లో గొడవలను పక్కదారి పట్టించేందుకే కేటీఆర్, హరీశ్‌లు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఏ తప్పూ చేయనప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటే హరీశ్‌కు భయమెందుకని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ప్రశ్నించారు. విచారణ సందర్భంగా వాస్తవాలు చెప్పి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు.