వాట్సాప్‌లోనే వాతావరణ సమాచారం!
ABN , Publish Date - May 31 , 2026 | 05:18 AM
తెలంగాణలోని రైతులకు వాతావరణ మార్పుల వల్ల పంట నష్టం కలగకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మంత్రి తుమ్మల చేతుల మీదుగా మొదటి మెసేజ్ విడుదల
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని రైతులకు వాతావరణ మార్పుల వల్ల పంట నష్టం కలగకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నేరుగా రైతుల మొబైల్ ఫోన్లకే సమయానుకూల వాతావరణ సమాచారాన్ని, సాగు సలహాలను అందించేందుకు ‘తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం’ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ.. డెవల్‌పమెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా, ఎవిడెన్స్ యాక్షన్ సంస్థలతో శనివారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులకు కచ్చితమైన వాతావరణ సమాచారం అందించేందుకే ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. వాతావరణ సమాచారంతో పాటు, ఆయా పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎలా రక్షించుకోవాలో తెలిపే వ్యవసాయ సూచనలను నేరుగా వాట్సాప్ మెసేజ్ ద్వారా అందజేస్తారన్నారు. కాగా, రాబోయే రుతుపవనాలు, వర్షపాతానికి సంబంధించిన మొదటి వాతావరణ సూచన సందేశాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించి, రైతుల వాట్సాప్ నంబర్లకు పంపారు.