Share News

గ్రామాల్లో ఇంటర్‌నెట్‌కు కొత్త కార్పొరేషన్‌

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:30 AM

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమెండెడ్‌ భారత్‌ నెట్‌...

గ్రామాల్లో ఇంటర్‌నెట్‌కు కొత్త కార్పొరేషన్‌

  • టీఆర్‌ఐఐసీఎల్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిర్వహణ

  • పదేళ్ల ఖర్చుల కోసం కేంద్రం నుంచి రూ.2,600 కోట్లు

  • రాష్ట్రం నుంచి సీఈవో, కేంద్రం నుంచి ఎక్స్‌అఫీషియో చైర్మన్‌

  • ఇరువైపుల నుంచి నలుగురు చొప్పున డైరెక్టర్లు

  • టీ-ఫైబర్‌ ఎండీనే కొత్త కార్పొరేషన్‌కు సీఈవో

  • తొలి విడతగా గ్రామీణ ప్రాంతాల్లో 3 లక్షల కనెక్షన్లు

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమెండెడ్‌ భారత్‌ నెట్‌ (ఏబీపీ) పథకంలో భాగంగా ‘తెలంగాణ రూరల్‌ ఇంటర్‌నెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఆర్‌ఐఐసీఎల్‌)’ను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర టెలీకమ్యూనికేషన్స్‌ శాఖ మార్గదర్శకాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో ఈ సంస్థ పనిచేయనుంది. ఈ కార్పొరేషన్‌ బోర్డులో రాష్ట్రం తరఫున ఒక సీఈవోతోపాటు ఐటీ, ఆర్థిక, పంచాయతీరాజ్‌, ఇంధన శాఖల ఉన్నతాధికారులు నలుగురు డైరెక్టర్లుగా ఉంటారు. కేంద్రం తరఫున ఎక్స్‌ అఫీషియో ఛైర్మన్‌, నలుగురు డైరెక్టర్లు ఉంటారు. తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ (టీ-ఫైబర్‌) ఎండీయే కొత్త కార్పొరేషన్‌ సీఈవోగా వ్యవహరిస్తారు. కొత్త కార్పొరేషన్‌ ఏర్పాటు అంశంలో కొన్ని వెసులుబాట్లు కల్పించాలన్న సీఎం రేవంత్‌, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తిపైనా కేంద్రం సానుకూలంగా స్పందించింది. కార్పొరేషన్‌ నిర్వహణ, విద్యుత్‌ బిల్లులు, ఇతర అవసరాలకు ఏటా రూ.260కోట్ల చొప్పున వచ్చే పదేళ్ల కోసం రూ.2,600 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ కనెక్టివిటీ కోసం సాయం చేయాలన్న ప్రతిపాదనపైనా సానుకూలత వ్యక్తం చేసింది. ‘భారత్‌ నెట్‌ ఉద్యమీ ప్రోగామ్‌’ కింద తొలివిడతలో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 3లక్షల కనెక్షన్లు ఇవ్వాలని, ఒక్కో కనెక్షన్‌కు రూ.10వేల చొప్పున మొత్తం రూ.300 కోట్లు ఇస్తామని తెలిపింది.

గ్రామీణ ప్రాంతాలకు కనెక్షన్లు, నిర్వహణ కోసం..

భారత్‌ ఫేజ్‌-1, 2 నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్‌ చేయడంతోపాటు కనెక్టివిటీ లేని గ్రామాలకు ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పించేందుకు కేంద్రం ఏబీపీను అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం ఫైబర్‌ నెట్‌ కనెక్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ‘టీ-ఫైబర్‌’ జిల్లా, మండల కేంద్రాల వరకు నెట్‌వర్క్‌ను నిర్వహిస్తుండగా.. కొత్తగా ఏర్పాటైన రూరల్‌ ఇంటర్‌నెట్‌ కార్పొరేషన్‌ మండల కేంద్రాల నుంచి గ్రామాల మధ్య నెట్‌వర్క్‌ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది.

Updated Date - Jun 02 , 2026 | 04:30 AM