Share News

‘ఆమె’ కోసం నిలబడండి

ABN , Publish Date - Mar 07 , 2026 | 03:54 AM

మహిళల భద్రత లక్ష్యంగా ‘ఆమె కోసం నిలబడండి (స్టాండ్‌ విత్‌ హర్‌)’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోంది. తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో...

‘ఆమె’ కోసం నిలబడండి

  • మహిళల భద్రత లక్ష్యంగా ‘స్టాండ్‌ విత్‌ హర్‌’

  • నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మహిళల భద్రత లక్ష్యంగా ‘ఆమె కోసం నిలబడండి (స్టాండ్‌ విత్‌ హర్‌)’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోంది. తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ శనివారం జేఎన్‌టీయూ క్యాంప్‌సలో ప్రారంభించనున్నారు. సీఎంతోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, డీజీపీ శివధర్‌రెడ్డి హాజరవుతున్నారని మహిళా భద్రతా విభాగం చీఫ్‌ చారుసిన్హా తెలిపారు. మహిళలపై జరిగే హింసను నిరోధించడంలో పురుషులు బాధ్యత తీసుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మహిళలపై హింస అనేది పెద్ద నేరాల రూపంలో మాత్రమే కాకుండా.. చిన్న చిన్న అనుచిత ప్రవర్తనలతో మొదలవుతుందని పేర్కొన్నారు. మహిళలను తప్పుగా చూడటం, అవమానకరమైన జోకులు వేయడం, ఆన్‌లైన్‌లో వేధించడం, కుటుంబ హింస, లైంగిక దాడులు మహిళల భద్రతకు ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయన్నారు. స్టాండ్‌ విత్‌ హర్‌ కార్యక్రమం ద్వారా మహిళలు తమను తాము రక్షించుకోవాలనే భావనను మార్చివేసి, ‘మహి ళల భద్రత.. సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత’ అనే సందేశాన్ని అందించాలనేది తమ అసలైన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా పురుషులు తమ చుట్టూ ఉన్న మహిళలపై జరుగుతున్న అన్యాయాలను గమనించి తమకేమీ పట్టనట్లు ఉండకుండా.. ఎదిరించాలనే బాధ్యతను గుర్తుచేయడం తమ ఉద్దేశమన్నారు. అవసరమైన సమయాల్లో పురుషులు నిశ్శబ్దంగా ఉండకుండా స్పందించి జోక్యం చేసుకోవడం, మహిళల గౌరవాన్ని కాపాడటం ఒక బాధ్యతగా మారాలన్నది సమాజానికి తెలిసేలా ఈ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించామని చారుసిన్హా తెలిపారు.

Updated Date - Mar 07 , 2026 | 03:54 AM