Share News

సర్వే సేవలకు ప్రత్యేక ఖాతా

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:25 AM

రాష్ట్రంలో భూ రికార్డుల వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సర్వే, సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డుల శాఖ అభివృద్ధి చేస్తున్న ప్రత్యేక..

సర్వే సేవలకు ప్రత్యేక ఖాతా

  • అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

  • ముందస్తు సర్వే, లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల సేవలు, ఆన్‌లైన్‌ ఫీజులు..ఆ ఖాతాలోకే

హైదరాబాద్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూ రికార్డుల వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సర్వే, సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డుల శాఖ అభివృద్ధి చేస్తున్న ప్రత్యేక సర్వే వెబ్‌ పోర్టల్‌ నిర్వహణ కోసం జాతీయ బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతా ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో సర్వే విభాగం కోసం ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పోర్టల్‌ను భూభారతి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖల పోర్టల్‌లతో అనుసంధానించనున్నారు. కొత్తగా అందుబాటులోకి తెస్తున్న సర్వే పోర్టల్‌ ద్వారా పొందే సేవల కోసం రుసుముల చెల్లింపులకు వీలుగా ప్రత్యేక ఖాతా ఉంటే బాగుంటుందని సర్వే విభాగం డైరెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు ప్రభుత్వాన్ని కోరడంతో.. ప్రభుత్వం అంగీకరించి నిర్ణయం తీసుకుంది. ఎంజాయ్‌మెంట్‌ స్కెచ్‌ మ్యాపులు, సర్వే సేవలకు సంబంధించిన దరఖాస్తులను ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భూభారతి పోర్టల్‌ ద్వారా దరఖాస్తుదారులు చెల్లించే ఫీజులు నేరుగా జమ అవుతాయి. అనంతరం ఆ సేవలను నిర్వహించే లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు ఇదే పేమెంట్‌ గేట్‌వే నుంచి చెల్లిస్తారు. ఈ పేమెంట్‌ గేట్‌ వే అమలు బాధ్యతను కూడా సర్వే విభాగానికే అప్పగించినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. పోర్టల్‌ ఏర్పాటుతో సర్వే సేవలను ఒకే వేదిక ద్వారా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. సర్వే దరఖాస్తులు, స్కెచ్‌ మ్యాపులు పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా జారీ చేస్తారు. ఫీజు వసూళ్లు, సర్వేయర్లకు చెల్లింపుల్లో పారదర్శకత పెరుగునుంది. భూ లావాదేవీల ప్రక్రియలో జాప్యం కూడా తగ్గుతుందని ఉత్తర్వుల్లో వివరించారు.

Updated Date - Jun 18 , 2026 | 06:26 AM