భూసార సంరక్షణకు వలంటీర్ల నియామకం
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:38 AM
భూసారాన్ని సంరక్షించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన యువ రైతులను ‘సాయిల్‌హెల్త్ వలంటీర్లు’గా నియమిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ప్రయోగాత్మకంగా కొడంగల్ నుంచి అమలు
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
పటాన్‌చెరు, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): భూసారాన్ని సంరక్షించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన యువ రైతులను ‘సాయిల్‌హెల్త్ వలంటీర్లు’గా నియమిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సాయిల్‌హెల్త్ వలంటీర్లుగా నియమించిన కొడంగల్ నియోజకవర్గానికి చెందిన 126 మంది యువరైతులకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో రెండు రోజులు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. భూసారం కోల్పోకుండా రసాయనిక ఎరువుల వాడకం తగ్గించడమే లక్ష్యంగా సాయిల్‌హెల్త్ వలంటీర్లు పనిచేస్తారని చెప్పారు. గ్రామానికి ఒక వలంటీర్‌ను నియమిస్తామన్నారు. ప్రయోగాత్మకంగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశామని, త్వరలోనే రాష్ట్రమంతా విస్తరిస్తామని వెల్లడించారు. అధిక దిగుబడులు సాధించాలంటే భూసారాన్ని బట్టి పంటలు సాగు చేయాలని, తరచుగా పంట మార్పిడి చేయాలని పేర్కొన్నారు. దీనిపై వలంటీర్లు రైతులకు అవగాహన కలిగిస్తారని తెలిపారు. శాస్ర్తీయ విధానాలపై రైతులకు సూచనలు చేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తారని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన సూచనలు అందించేందుకు ఇక్రిశాట్‌తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇక్రిశాట్ డీజీ హిమాన్షు పాఠక్, వ్యవసాయశాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, ఉద్యానవనశాఖ డైరెక్టర్ యాస్మిన్‌భాషా, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రాజిరెడ్డి, జానయ్య, డీడీజీ స్టాన్‌ఫోర్డ్ బ్లాడే తదితరులు పాల్గొన్నారు.