సైబర్ సెక్యూరిటీపై షీల్డ్ 2.0
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:15 AM
సైబర్ నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘షీల్డ్ 2.0’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు.
నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘షీల్డ్ 2.0’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. సైబర్ నేరాలను అరికట్టడానికి సైబర్ బ్యూరో రూపొందించిన భద్రతా సాధనాలను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా జరగనున్న ఈ సదస్సులో.. వివిధ రాష్ట్రాల నుంచి పోలీస్ అధికారులు, సైబర్ సాంకేతిక నిపుణులు పాల్గొననున్నారు. సైబర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ‘సైఫర్ స్ర్పింట్’ కార్యక్రమంలో భాగంగా ‘బాధితులకు రక్షణ- డిజిటల్ భవిష్యత్తుకు భద్రత’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీపీ శిఖా గోయల్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న నేరాలే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికత వినియోగించుకుని భవిష్యత్తులో రాబోయే నేరాల గురించి కూడా ఈ సదస్సులో చర్చించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొంటారని ఆమె వివరించారు. మధ్యాహ్నం జరిగే సెషన్లలో కేంద్ర ఐటీశాఖ అడిషనల్ సెక్రటరీ అభిషేక్ సింగ్, ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాసుదేవన్ కీలక ప్రసంగాలు చేయనున్నారు.