తెలంగాణలో ‘రహ-వీర్’!
ABN , Publish Date - Feb 09 , 2026 | 02:09 AM
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రహ-వీర్’ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది.
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడితే రూ.25 వేల ప్రోత్సాహకం
గుర్తింపు, ప్రశంసాపత్రం: రవాణా శాఖ
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రహ-వీర్’ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే భయపడకుండా ముందుకు వచ్చి బాధితుల ప్రాణాలను కాపాడిన సాధారణ పౌరులను (గుడ్ సమారిటన్స్) ఈ పథకం ద్వారా ప్రోత్సహించి గౌరవించనున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడిన ప్రతి వ్యక్తిని ‘రహ-వీర్’గా గుర్తించి, ఈ పథకం కింద రూ.25,000 బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపింది. గుడ్ సమారిటన్లకు చట్టపరంగా పూర్తి రక్షణ ఉంటుందని, పోలీసు దర్యాప్తులు, కోర్టు విచారణల పేరుతో వేధింపులు ఉండవని రవాణా శాఖ స్పష్టం చేసింది. ప్రమాదానికి గురైన బాధితులకు ఆస్పత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణ వైద్యసేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. పథకం అమలులో భాగంగా జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు విస్తృత ప్రచారం కల్పించాలని సర్క్యూలర్ జారీ చేసింది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, ఎస్పీ, జిల్లా మెడికల్, హెల్త్ అధికారులు సభ్యులుగా, జిల్లా రవాణా శాఖ అధికారి కన్వీనర్‌గావ్యవహరిస్తారని పేర్కొంది. ప్రమాద సమయంలో సహాయం చేసిన వ్యక్తి వివరాలను సంబంధిత ఎస్‌హెచ్‌ఓ, ఆస్పత్రి అధికారులు నమోదు చేసి, పోలీసు అధికారి ద్వారా జిల్లా కమిటీకి సిఫార్సు చేస్తారు. కమిటీ ఆమోదం పొందిన అనంతరం అర్హులైన వ్యక్తులను ‘రహ-వీర్’గా ఎంపిక చేసి, వివరాలను రవాణా కమిషనర్‌కు పంపిస్తారు. అనంతరంనగదు బహుమతి అందజేస్తామని రవాణాశాఖ తెలిపింది. ‘‘రోడ్డు భద్రత-ప్రతి ఒక్కరి బాధ్యత’’అనే సందేశంతో రహ-వీర్ పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరింది.