Share News

విద్యాశాఖలో ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’

ABN , Publish Date - Mar 07 , 2026 | 03:48 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ను చేపట్టింది. మార్చి 6న ప్రారంభమైన ఈ ప్రత్యేక కార్యాచరణ జూన్‌ 12 వరకు....

విద్యాశాఖలో ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’

  • 99 రోజుల ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం

  • పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి

హైదరాబాద్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ను చేపట్టింది. మార్చి 6న ప్రారంభమైన ఈ ప్రత్యేక కార్యాచరణ జూన్‌ 12 వరకు, అంటే 99 రోజుల పాటు కొనసాగనుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారుశుధ్య నిర్వహణతో పాటు విద్యార్థుల నమోదును పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో సాగే ఈ ప్రణాళిక కోసం జిల్లా విద్యాశాఖాధికారులను నోడల్‌ అధికారులుగా నియమించి, క్షేత్రస్థాయిలో పనుల అమలును ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ప్రగతి ప్రణాళికను ప్రభుత్వం మొత్తం 14 విడతలుగా విభజించింది. మొదటి విడతలో భాగంగా మార్చి 6 నుంచి 15 వరకు 10 రోజుల పాటు ప్రత్యేక డ్రైౖవ్‌ నిర్వహిస్తారు. ఈ సమయంలో పాఠశాల ఆవరణలను శుభ్రం చేయడం, పెండింగ్‌లో ఉన్న పరిపాలనా పరమైన ఫైళ్లను పరిష్కారించడం, డిజిటల్‌ పరిపాలనను బలోపేతం చేయడం వంటి పనులకు ప్రాధాన్యం ఇస్తారు. కేవలం పాఠశాల విద్యకే పరిమితం కాకుండా ఇంటర్‌, డిగ్రీ, సాంకేతిక విద్య, వర్సిటీలలో కూడా ఇదే తరహా మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఉన్నత విద్యలో నైపుణ్యాభివృద్ధికి ఈ ప్రణాళికలో పెద్దపీట వేశారు. విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, ఉపాధికి అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యాలను అందించడంపై దృష్టిసారించారు.

Updated Date - Mar 07 , 2026 | 03:48 AM