ఇసుక అక్రమాలకు మన ఇసుక-మన వాహనంతో చెక్
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:37 AM
రాష్ట్రంలో ఇసుక మాఫియాను కట్టడి చేయడానికి సర్కారు నడుం బిగించింది. ఆన్‌లైన్ ద్వారా ఇసుక బుకింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఆన్‌లైన్‌లో యాప్ ద్వారా ఇసుక బుకింగ్..ఒకటి, రెండు రోజుల్లో ఇంటి వద్దకే ఇసుక
ప్రయోగాత్మకంగా కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అమలు
పెద్దపల్లి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇసుక మాఫియాను కట్టడి చేయడానికి సర్కారు నడుం బిగించింది. ఆన్‌లైన్ ద్వారా ఇసుక బుకింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ‘మన ఇసుక.. మన వాహనం’ పేరిట రూపొందించిన యాప్‌ను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ముందుగా ఈ విధానాన్ని కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. బుకింగ్ చేసుకుంటే 24 గంటల్లో ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో సంబంధిత అధికారులు, సిబ్బందికి ఇసుక బుకింగ్,. రవాణా అనుమతులు, జీపీఎస్ ట్రాకింగ్, చెల్లింపులు, ఫిర్యాదుల పరిష్కారం వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఇసుక కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవడం వల్ల దళారుల ప్రమేయం ఉండదని, ఇసుకలోడ్‌తో వెళుతున్న వాహనాన్ని ట్రాక్ చేయడం వల్ల అక్రమ రవాణాను సులువుగా గుర్తించే అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్న సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. అంతేకాక ఆయా ఇసుక క్వారీల నుంచి దూరాన్ని బట్టి ఇసుక ధరలను నిర్ణయించడం వల్ల వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించనున్నది. ‘మన ఇసుక.. మన వాహనం’ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఆయా జిల్లాల్లో ఆరంభించిన తర్వాత అక్కడ తలెత్తే ఇబ్బందులను సరిచేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. వాస్తవానికి 2017లో స్యాండ్ ట్యాక్సీ విధానాన్ని పెద్దపల్లి జిల్లాలో అమల్లోకి తెచ్చారు. మానేరు, గోదావరి నదుల్లో గుర్తించిన ఇసుక క్వారీల నుంచి ఆన్‌లైన్ ద్వారా ఇసుక కోసం బుకింగ్ చేసుకున్న 24 గంటల్లోపు ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేశారు. స్యాండ్ ట్యాక్సీ విధానాన్ని అమలు చేసేందుకు ప్రత్యేకించి సిబ్బందినీ నియమించారు. ఇటు ప్రభుత్వ ఖజానాకు కూడా డబ్బులు జమయ్యాయి. అయితే, అప్పట్లోనే కొంతమంది ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో దీనిని నిలిపివేశారు.