Share News

నేటి నుంచి ‘వాహన్‌’ సేవలు

ABN , Publish Date - Mar 23 , 2026 | 05:49 AM

వాహనదారులు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర రవాణా శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.

నేటి నుంచి ‘వాహన్‌’ సేవలు

  • ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

  • కేంద్రం పరిధిలోని పరివాహన్‌ పోర్టల్‌లోకి రాష్ట్ర వాహనాల డేటా బదిలీ

  • యజమాని పేరు, చిరునామా మార్పు ఇక ఆన్‌లైన్‌లోనే.. డూప్లికేట్‌ ఆర్‌సీ కూడా

హైదరాబాద్‌ సిటీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర రవాణా శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. సోమవారం నుంచి కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని వాహన్‌ సేవలను వినియోగంలోకి తేనుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ సేవలను ప్రారంభించనున్నారు. మొదటివిడతగా కొత్తగా రిజిస్ర్టేషన్‌ చేసుకునే వాహనాలకు ఈ సదుపాయం కల్పించనున్నారు. మున్ముందు పాత వాహనాలకు సంబంధించిన సేవలూ కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన పరివాహన్‌ పోర్టల్‌ ద్వారా అందనున్నాయి. వాహన్‌ సేవలు అందుబాటులోకి వస్తే వాహన యజమాన్య మార్పు, రిజిస్ర్టేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్‌సీ)పై చిరునామా మార్పు, డూప్లికేట్‌ ఆర్‌సీ, రవాణా వాహనాలకు సంబంధించిన రుసుము, పన్నులు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే అవకాశం ఉంటుంది. మొబైల్‌ నంబర్‌నూ ఆన్‌లైన్‌లోనే మార్చుకోవచ్చు. ఇతర రాష్ర్టాలకు మారినప్పుడు వాహనాల రిజిస్ర్టేషన్‌ మార్చుకునేందుకు నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. నేషనల్‌ పర్మిట్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ సేవలూ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. ఆటోమెటిక్‌ ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ స్టేషన్లలో వాహనాన్ని పరిశీలించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని వాహనాల డేటా పరివాహన్‌ పోర్టల్‌లోకి బదిలీ అయిందని, దశల వారీగా పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి తెస్తామని ఓఅధికారి తెలిపారు. ఇక రాష్ట్రంలో సారథి సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. గతంలో సికింద్రాబాద్‌ తిరుమలగిరి ఆర్‌టీఏ కార్యాలయంలో పైలట్‌ ప్రతిపాదికన ఈ సేవలు ప్రారంభించారు. సక్సెస్‌ కావడం తో రాష్ట్రమంతా వినియోగంలోకి వచ్చాయి. లెర్నర్‌, డ్రైవిం గ్‌ లైసెన్స్‌లు, డ్రైవింగ్‌ స్కూళ్ల అనుమతి జారీ వంటివి పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

Updated Date - Mar 23 , 2026 | 05:50 AM