రాష్ట్రంలో సరోగసి అక్రమాలకు చెక్
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:57 AM
రాష్ట్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు, సరోగసీ పేరిట సాగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
అల్ట్రా స్కానింగ్ చేస్తే ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిందే
ఇకపై ప్రతి కదలికపై నిఘా
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు, సరోగసీ పేరిట సాగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. లింగనిర్ధారణ నిషేధ చట్టం 1994 (పీసీపీఎన్‌డీటీ), అసిస్టెడ్ రిప్రోడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ), సరోగసీ చట్టాల అమలును మరింత పటిష్ఠం చేసేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ పేరుతో పక్కా డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల మహిళల హక్కులను రక్షించడంతో పాటు వైద్యరంగంలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. లింగ నిర్థారణ నివారించేందుకు 1994 పీసీపీఎన్‌డీటీ చట్టానికి ఈ కొత్త పోర్టల్ మరింత బలాన్ని ఇవ్వనుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్‌లో జరిగే అల్ర్టాసౌండ్ పరీక్షల వివరాలను వైద్యులు తప్పనిసరిగా ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాల్సిందే. ఒకసారి వివరాలు నమోదు చేసిన తర్వాత మార్చే వీలుండదు. ఒకవేళ ఏదైనా సెంటర్‌లో రెగ్యులర్‌గా జరిగే స్కానింగ్‌ల కంటే.. ఎక్కువ స్కానింగ్‌లు జరుగుతున్నట్లు గుర్తిేస్త సిస్టం వెంటనే హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ కేంద్రంపై దాడులు చేసే వీలుంటుంది.
సరోగసికి ఆధార్ లింక్
పిల్లలు లేని దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకుని సాగుతున్న అద్దె గర్భం (సరోగసీ) వ్యాపారానికి ఈ పోర్టల్ బ్రేక్ వేయనుంది. సరోగసీ నియంత్రణ చట్టం ప్రకారం.. వాణిజ్యపరమైన సరోగసీ చట్టవిరుద్ధం. కేవలం మానవతా దృక్పథంతో చేేస సరోగసీకే అనుమతి ఉంది. దీన్ని కూడా కొన్ని ఐవీఎఫ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. తాజాగా విధానంలో.. దంపతులు, సరోగేట్ తల్లి, ఆసుపత్రి యాజమాన్యం వారి వివరాలు పోర్టల్ ద్వారానే రిజిస్టర్ చేయాలి. ఒక మహిళకు గతంలో ఎన్నిసార్లు సరోగసీ జరిగింది?.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి?.. అనే వివరాలు ఆధార్‌తో లింక్ చేస్తారు. అలాగే, సరోగసి మహిళకు అందే వైద్య సదుపాయాలు, ఆమె ఆరోగ్య రక్షణ, బీమా వంటి హక్కులను ఈ పోర్టల్ ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు. దీంతో ఒకే మహిళ పలుమార్లు సరోగేట్ తల్లిగా మారకుండా ఇది అడ్డుకుంటుంది. కాగా, ఆస్పత్రులు, క్లినిక్‌లను తనిఖీ చేయడానికి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిన అవసరం లేదు. అధికారులు ఇప్పుడు ఆఫీసులో కూర్చునే డేటాను విశ్లేషించి అక్రమాలను కనిపెట్టవచ్చు. తద్వారా నిబంధనలు ఉల్లంఘించే ఆస్పత్రులు, క్లినిక్‌లకు లైసెన్స్‌ల రద్దుతో పాటు భారీ జరిమానాలు, జైలుశిక్షలు అమలు చేయడం సులభమవుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.