‘లాజిస్టిక్స్ పాలసీ 2.0’తో అభివృద్ధికి పెద్దపీట
ABN , Publish Date - Jun 13 , 2026 | 07:17 AM
‘లాజిస్టిక్స్ పాలసీ 2.0’ ద్వారా రాష్ట్రంలో మెగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, డ్రై పోర్టులు, బాండెడ్ వేర్ హౌజింగ్, లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నామని..
సమర్థంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ వినియోగం: దుద్దిళ్ల
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): ‘లాజిస్టిక్స్ పాలసీ 2.0’ ద్వారా రాష్ట్రంలో మెగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, డ్రై పోర్టులు, బాండెడ్ వేర్ హౌజింగ్, లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ను చిత్తశుద్ధితో అభివృద్థి చేస్తున్నామని చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్-2026’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ లక్ష్యసాధనలో ‘లాజిస్టిక్స్’ రంగం కీలక పాత్ర పోషించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.