Share News

‘స్మార్ట్‌’గా భూ రెవెన్యూ ‘సర్వే’

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:16 AM

రోజురోజుకు సాంకేతికత కొత్త రూపును సంతరించుకుంటోంది. గతంలో ఉన్నత విద్యావంతులకే పరిమితమైన టెక్నాలజీ ప్రస్తుతం సామాన్యులు, రైతుల అరచేతిలోనే ప్రత్యక్షమవుతోంది.

‘స్మార్ట్‌’గా భూ రెవెన్యూ ‘సర్వే’

  • అన్నదాత అరచేతిలో ‘సమీకృత భూభారతి’ పోర్టల్‌

  • నేటి నుంచి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా పోర్టల్‌ అమలు

  • అధికారులకు పొంగులేటి దిశా నిర్దేశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్ర జ్యోతి): రోజురోజుకు సాంకేతికత కొత్త రూపును సంతరించుకుంటోంది. గతంలో ఉన్నత విద్యావంతులకే పరిమితమైన టెక్నాలజీ ప్రస్తుతం సామాన్యులు, రైతుల అరచేతిలోనే ప్రత్యక్షమవుతోంది. ఇప్పుడు ‘మీ వద్ద స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే సరి.. మీ భూ వివరాలు’ తెలుసుకోవచ్చు. సామాన్య రైతుల భూసమస్యల పరిష్కారానికి ‘సమీకృత భూభారతి’ పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. గతంలో మాదిరిగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రైతులు ‘మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేదు’ అని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు. ఇంట్లో నుంచే స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా భూసేవలు పొందడానికి పోర్టల్‌ రూపొందించామన్నారు. అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని రైతులు పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుని సేవలను పొందవచ్చునని తెలిపారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఆలోచన మేరకు పారదర్శక సేవలకు వీలుగా ల్యాండ్‌, సర్వే, రిజిస్ట్రేషన్‌ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి రూపొందించిన ‘సమీకృత భూ భారతి’ పోర్టల్‌ను గురువారం (ఏప్రిల్‌ 2) నుంచి నారాయణపేట జిల్లా కోస్గి, ఖమ్మం జిల్లా కూసుమంచి, కొత్తగూడెం-భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే.. పోర్టల్‌ ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన రెవెన్యూ అధికారులకు బుధవారం టెలి కాన్ఫరెన్స్‌లో దిశా నిర్దేశం చేశారు. పోర్టల్‌ నిర్వహణపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ మండలాల నుంచి వచ్చే ఫలితాల ఆధారంగా మార్పులూ చేర్పులతో రెండో దశలో రాష్ట్రమంతా అమలు చేస్తామని వెల్లడించారు.


ఇలా సమీకృత భూ భారతి పని తీరు

ఈ పోర్టల్‌లో లాగిన్‌ అయిన వెంటనే రైతు తన భూ వివరాలు తెలుస్తాయి. అన్నదాత తనకు గల భూమి సర్వే కోరితే.. ఎకరాల వారీగా ఎంత ఫీజు చెల్లించాలో స్ర్కీన్‌ (తెర)పై కనిపిస్తుంది. సర్వే ఫీజు చెల్లించగానే.. సంబంధిత గ్రామ సర్వేయర్‌ లాగిన్‌లోకి ఆ వివరాలు వెళతాయి. అటుపై 2 రోజులకు సదరు భూమి సరిహద్దుల్లోని రైతులకు రెవెన్యూశాఖ నోటీసులు జారీ చేస్తుంది. తర్వాత ఏడు రోజుల్లో భూ సర్వే పూర్తి చేస్తారని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అటుపై మండల సర్వేయర్‌ లాగిన్‌కు వెళ్లిన సర్వే వివరాలు.. ఆయన పరిశీలన తర్వాత తహసీల్దార్‌ ఆమోదంతో రైతుకు సర్వే మ్యాప్‌, భూధార్‌ నంబరు కేటాయిస్తారని స్పష్టం చేశారు. ఈ వివరాలన్నీ పోర్టల్‌లోనూ నమోదు చేస్తారు. దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ప్రక్రియ ముగిసేవరకు ప్రతి దశలో పురోగతిని తెలుపుతూ దరఖాస్తుదారుని ఫోన్‌కు మెసేజ్‌ వెళుతుంది.

5 మండలాల్లో ప్రతి సర్వే నంబరుకు మ్యాప్‌

ప్రయోగాత్మకంగా సమీకృత భూభారతి పోర్టల్‌ను అమలు చేస్తున్న 5 మండలాల్లో ప్రతి సర్వే నంబరుకు సర్వే మ్యాప్‌ ఇస్తామని పొంగులేటి అన్నారు. పాత విధానాలకు స్వస్తి పలికి.. ఆధునిక సాంకేతికతతో నిర్వహించడంవల్ల త్వరితగతిన భూముల సర్వే పూర్తవుతుందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా సమీకృత భూభారతి పోర్టల్‌.. రెవెన్యూ వ్యవస్థలో చారిత్రక మార్పునకు నాంది పలుకుతుందని తెలిపారు.

Updated Date - Apr 02 , 2026 | 03:16 AM